– పర్సనల్ కోచ్ హఫీజ్ హషీమ్
హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు త్వరలోనే గెలుపు బాట పడుతుందని ఆమె నూతన వ్యక్తిగత కోచ్ హఫీజ్ హషీమ్ అన్నారు. పి.వి సింధుతో కలిసి ఇప్పటికే ట్రైనింగ్ మొదలుపెట్టిన హఫీజ్.. ఈ వారంలో జరుగనున్న కొరియా ఓపెన్ నుంచే సింధు పుంజుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ ఒలింపిక్స్ అర్హత ప్రక్రియ మొదలైంది. షట్లర్లు అందరూ బరిలో నిలువటంతో కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది. మా లక్ష్యం ఒలింపిక్స్‌కు అర్హత మాత్రమే కాదు, పారిస్‌లో పసిడి పతకం సాధించటం. ప్రాక్టీస్‌లో సింధు మెరుగ్గా ఆడుతోంది. గేమ్ ప్లాన్, వ్యూహలపై చర్చించాం. సింధు బలం స్మాష్‌లు. స్మాష్‌లు నిలకడగా సంధించటం, సులువైన పాయింట్లు సొంతం చేసుకోవటం, గేమ్ వ్యవధి కుదించటం, గేమ్‌పై ఆలోచించకుండా వీలైనన్ని ఎక్కువ పాయింట్లు సాధించటం వంటి వాటిపై దృష్టి నిలిపాం. సింధు బిగ్ మ్యాచ్ ప్లేయర్. ఇటీవల నిలకడలేమి ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు’ అని హఫీజ్ తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ వరకు హఫీజ్‌ను సింధు వ్యక్తిగత కోచ్‌గా కొనసాగించాలని సారు (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)ను కోరినట్టు ఆమె తండ్రి పి.వి రమణ వెల్లడించారు.