ఒడెన్సే : ఈ ఏడాది తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధుకు మరోసారి నిరాశే మిగిలింది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ సెమీఫైనల్లోనే సింధు పోరాటం ముగిసింది. తనకంటే మెరుగైన ర్యాంకర్ కరోలిన్ మరిన్(స్పెయిన్) చేతిలో శనివారం భారత షట్లర్ చిత్తుగా ఓడిపోయింది. గంట 13 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో మరిన్ దూకుడు ముందు నిలవలేక 18-21, 21-19, 7-21తో పరాజయం పాలైంది. తొలి రెండు సెట్లలో అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న సింధు.. మూడు సెట్‌లో కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. అజాతశత్రువు అయిన మరిన్ చేతిలో సింధుకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. 2016 రియో ఒలిపింక్స్ ఫైనల్లో, 2018 వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరులో సింధు ఆశలపై మరిన్ నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో సింధు, మరిన్ ఒకరిపై ఒకరు నోరుపారేసుకోవడంతో.. చైర్ అంపైర్ ఇద్దరికీ ఎల్లో కార్డులు జారీ చేశారు.