క్వార్టర్స్‌లో సింధు

క్వార్టర్స్‌లో సింధు– ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2024
పారిస్‌ : తెలుగు తేజం పి.వి సింధు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో ఫామ్‌ అందుకున్న సింధు.. అదే జోరు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కొనసాగిస్తుంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో పి.వి సింధు మూడు గేముల మ్యాచ్‌లో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. అమెరికా షట్లర్‌ బీవెన్‌ జాంగ్‌పై 13-21, 21-10, 21-14తో సింధు మెరుపు విజయం సాధించింది. తొలి గేమ్‌లో నిరాశపరిచిన సింధు.. తర్వాత వరుసగా రెండు గేముల్లో దుమ్మురేపింది. ఏకపక్షంగా చివరి రెండు గేముల్లో గెలుపొంది క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపింది. 55 నిమిషాల మ్యాచ్‌లో సింధు సాధికారిక ప్రదర్శన చేసింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే ఎదురైంది. 2-19, 12-21, 20-22తో వరల్డ్‌ నం.17 చైనీస్‌ తైపీ షట్లర్‌ చో చెన్‌ చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌ నెగ్గిన శ్రీకాంత్‌, రెండో గేమ్‌లో నిరాశపరిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ను టైబ్రేకర్‌లో చేజార్చుకుని ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 నుంచి నిష్క్రమించాడు.