గాయంతో సింధు ఔట్‌

Sindhu out with injury– ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌
గువహటి : భారత స్టార్‌ షట్లర్‌, రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి సింధు 2025 ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌ పోటీల నుంచి తప్పుకుంది. గతంలో మెడల్‌ సాధించిన భారత జట్టులో పి.వి సింధు కీలక పాత్ర పోషించింది. గాయంతో బాధపడుతున్న పి.వి సింధు చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక పోటీలకు దూరమైంది. ఫిబ్రవరి 11-16న ఈ టోర్నమెంట్‌ జరుగనుండగా.. భారత జట్టు గువహటిలో శిక్షణ శిబిరంలో సాధన చేస్తోంది. సింధుతో పాటు లక్ష్యసేన్‌, హెచ్‌.ఎస్‌ ప్రణరు, సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టిలు సైతం శిక్షణ శిబిరంలోనే ఉన్నారు. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ కఠినమైన గ్రూప్‌-డిలో చోటుచేసుకుంది. గత సీజన్‌ రన్నరప్‌ దక్షిణ కొరియా, మకావులు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. ఫిబ్రవరి 12న మకావు, 13న దక్షిణ కొరియాతో భారత్‌ తలపడనుంది. ‘2025 బ్యాడ్మింటన్‌ ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌లో ఆడటం లేదు. శిక్షణ శిబిరంలో సాధన చేస్తుండగా గాయమైంది. ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో గాయం నుంచి కోలుకునేందుకు సమయం పడుతుందని తేలింది. భారత జట్టుకు నా శుభాకాంక్షలు’ అని సింధు సోషల్‌ మీడియాలో వెల్లడించింది.