ఔటర్‌ సమీపంలో పారిశ్రామిక సిటీ

Industrial City near Outer– 25వేల ఎకరాల్లో నిర్మాణం : సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో 25 వేల ఎకరాల్లో కాలుష్య రహిత పారిశ్రామిక సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిలో హెల్త్‌, స్పోర్ట్స్‌కు సంబంధించిన పరిశ్రమలు ఉంటాయన్నారు. నానక్‌రామ్‌గూడలో తెలంగాణ స్టేట్‌ ఫైర్‌ సర్వీసెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ బిల్డింగ్‌ను ఆదివారంనాడాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్‌ నగరం అనువైన ప్రాంతమనీ, ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నా నగరాభివృద్ధి కొనసాగిందని చెప్పారు. ఇక్కడ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే, మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి త్వరలో మెగా మాస్టర్‌ ప్లాన్‌-2050 తీసుకొస్తామనీ, అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ పేరుతో మూడు భాగాలుగా విభజించి, ఎక్కడికక్కడ స్థానిక పరిశ్రమల్ని నెలకొల్పి అభివృద్ధిని సాధిస్తామని వివరించారు. ఈ ప్రణాళికలపై తమకు పూర్తి స్పష్టత ఉన్నదన్నారు. మెట్రోరైల్‌ను ప్రజలకు మరింత ఉపయోగపడేలా విస్తరణ చేపడతామని చెప్పారు. ఫార్మా సిటీలు కాకుండా, ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఎలాంటి అపోహలు వద్దనీ, తమకు తామే మేధావులమని భావించబోమనీ, అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలతో ముందుకెళతామని అన్నారు. దానికోసం ఆలోచించి భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించుకుంటామన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎవర్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా అగ్నిమాపకశాఖ సేవల్ని ఆయన కొనియాడారు. ప్రమాదం జరిగినప్పుడు అందరికంటే ముందుండేది ఫైర్‌ డిపార్ట్‌ మెంటే అనీ, ప్రజల రక్షణ కోసం ఫైర్‌ సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతారని ప్రసంసించారు.