దేశంలో అసమానతలు పెరుగుతున్నాయి!

Inequality is increasing in the country!ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం ఆగస్టు 15తో మరో ఏడాదిలోకి ప్రవేశించనుంది. ఇప్పటికే దేశం అభివృద్ధిలో వెలిగిపోతోందని కేంద్రం అమృ తోత్సవాలు నిర్వహించింది. వారు చెప్పే అమృతకాలం ప్రజల కోసమా… ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపే పెట్టుబడిదారుల కోసమా? అనేది జగమెరిగిన సత్యం. ఇది ఓ వైపు చర్చ జరుగుతున్న సమయంలోనే పేదరికం తగ్గిందని ఇటీవల విడుదలైన నివేదికలను చూపి కేంద్రం సంకలు గుద్దుకుంటోంది. నిజంగా పేదరికం తగ్గిందా? వాస్తవానికి తగ్గచ్చు! కానీ తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టు కోవడానికి బట్ట లేని అభాగ్యులు ఈ భారతవనిలో కోట్లలో ఉన్నారు. కేంద్రం అనుకూలమైన నివేదికలను పట్టుకుని ప్రపంచంలోనే దేశం అగ్రగామిగా దూసుకెళ్తోందని భ్రమపడితే అంతకన్నా సిగ్గుచేటు మరోటి ఉండదు.
”గ్లోబల్‌ మల్టీ డైమెన్షనల్‌ పావర్టి” ఇండెక్స్‌ నివేదిక ప్రకారం ‘గత పదిహేనేండ్ల కాలానికి సంబంధించి భారతదేశంలో 415 మిలియన్ల జనాభా(41.5 కోట్లు) పేదరికం నుండి బయటపడింది. ప్రపంచంలో 25 దేశాలు తమ దేశంలోని మొత్తం పేదల్లో సగాన్ని ఈ 15ఏళ్ల కాలంలో తగ్గించుకోగలిగాయి.’ ఆహా ఎంత మంచి వార్త కదా ఇది..! అదే అదునుగా ఏలికల వారి సోషల్‌ మీడియా కావలసినంత ఊదరగొడుతుంది. సదరు నివేదిక ప్రకారం ఈ సంఖ్యలన్నీ సరైనవే కావచ్చు! కానీ గణాంకాలు అన్వయించుకునే వారి తెలివితేటలను బట్టి అవి గమ్మత్తుగా దర్శన మిస్తాయి. కనీస వసతులు తీరిన వారందరూ పేదలు కారని తేల్చేస్తున్నారు, కానీ ఆదాయాల, ఆస్తిపాస్తుల వ్యత్యాసాల్లో మూడు దశాబ్దాల కిందటికంటే మూడు రెట్లు పెరిగింది. అనగా ఆదాయాల పెరుగుదలల్లో విపరీత వ్యత్యాసాలున్నవి.
ఈ మధ్యకాలంలో అనేక ప్రపంచ నివేదికలు, ప్రపంచ స్థాయి సంస్థలు దారిద్య్రాన్నీ, పేదరికాన్ని, వెనుకబాటు తనాన్ని ఆయా వేదికలపై ప్రస్తావించడానికి మొగ్గుచూపటం లేదు. దేశాలలోని అంతర్గత, మత పరమైన కలహాలనూ బయటికి పొక్కకుండా జాగ్రత్త వహిస్తున్నారు. దీనినే ”ఫాల్స్‌ ప్రెస్టేజ్‌” అని అంటారు. ఆత్యధిక ధన వంతులు, వారి వర్గానికి సంబంధించిన వారు ఎక్కువ మంది పరిపాలనలో భాగస్తులై చట్టసభల్లో కూర్చున్నప్పుడు ఇలాంటి భావనలే ప్రాచుర్యంలోకి వస్తాయి. సమస్యను అనుభవిస్తున్న వర్గం, చైతన్యానికి ప్రతీకగా నిలిచే మేధావులకు నేటి చట్టసభల్లో, అంతర్జాతీయ వేదికలలో స్థానం తగ్గిపోతున్నది. అందువల్ల వాస్తవాలను వ్యక్తీకరించే కన్నా ప్రగల్బాలను ప్రచురించడంలో సదరు ధనిక వర్గం సఫలమవుతుంది. మన దేశంలో కూడా వాస్తవాలను కప్పి ఉంచి దేశం వెలిగిపోతుంది అని ప్రచారం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. దీని అర్థం దేశం పూర్తిగా వెనకబడి పోయిందని అసలు అభివృద్ధి అనేది జరగలేదని చెప్పడం కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చోటు చేసుకోవడం ఖాయం. ఆ అభివృద్ధి జీవుల సమూహాల మధ్య ఎంత సమతుల్యతతో జరిగింది అనేది ప్రధానం. సోషల్‌ మీడియాలో అందమైన దృశ్యాలకు ఉన్నంత ప్రాధాన్యత అందవిహీనమైన వాటికి ఉండదు. అంచేత వినోదం భక్తి సంబరాలు, సాధిóంచబడిన కొన్ని విజయాలు మాత్రమే అందరికీ వార్తలుగా చేరు తుంటాయి. వెనుకబడిన, నిర్లక్ష్యం కాబడిన అనేక అంశాలు కనుమరుగవుతుంటాయి. ఈవాస్తవాన్ని గమనించకుంటే గణాంకాలు తప్పుదోవ పట్టిస్తాయి.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో విద్యా, వైద్యం, విద్యుత్తు, పారిశుధ్యం, తాగునీరు మొదలగు సౌకర్యాల అందుబాటును బట్టి పేదరికం నుండి బయటపడ్డట్లుగా నిర్థారించడం జరిగింది. 2005లో భారత దేశంలో 645 మిలియన్ల పేదలు ఉంటే 2021లో 230 మిలియన్ల పేదలకు తగ్గిపోయింది. ఈ విధంగా శిశు మరణాలు పౌష్టిక ఆహారం వంటి అనేక కీలక అంశాల్లో పేదలు తమ స్థాయిని పెంచుకున్నారని, ఇది భారత్‌లో మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన చైనా వంటి దేశాల్లో కూడా నమోదైందని ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ఒక నివేదికలో తెలిపింది. అయితే ఇవే నివేదికల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 1.1 బిలియన్‌ (110 కోట్ల) ప్రజలు కడుపేదరికంలో ఉన్నారని ఈ సమస్య ఆఫ్రికాలో ఎక్కువగాను ఆ తర్వాత స్థానంలో ఆసియా ఉన్నదని పేర్కొన్నది.
వసతులు అందుబాటులో ఉండడానికి వాటిని వినియోగించడానికి, వాటి వల్ల నమోదయ్యే తుది ఫలితాలకు చాలా వ్యత్యాసం ఉన్నది. మనదేశంలో పాఠశాలలు 90శాతం అందుబాటులో ఉన్నవి అయినప్పటికీ మొత్తం చిన్నారులంతా పాఠశాలలో చేరడం లేదు. చేరిన చిన్నారుల్లో నాణ్యమైన విద్యను అభ్యసించే వారి సంఖ్య నామమాత్రం. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్యకు వెళ్లే వారి సంఖ్య మరింత తక్కువగా ఉన్నది. మధ్యాహ్న భోజన పథకం లేకుంటే, దేశంలో ప్రతి రాష్ట్రంలో సగటున 25లక్షల విద్యార్థులు ఉన్నారని చెప్పబడుచున్న చోట, సగానికి పైగా హాజరు శాతం పడిపోయే ప్రమాదం ఉన్నది. వైద్యం విషయంలోనూ అంతే. ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల ద్వారా వైద్యాన్ని ప్రజల వద్దకు తెచ్చామని ప్రభుత్వాలు చెబుతాయి కానీ వాటి వల్ల నామమాత్రపు ఉపయోగం ఉందని ప్రజలు వాపోతున్నారు. తాగునీరు విషయంలోనూ అభివృద్ధి నమోదైన మాట వాస్తవమే కానీ అది పరిమిత ప్రాంతాలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వబడి ఇతర ప్రాంతాలు అరకొర ఏర్పాట్లతో నిర్లక్ష్యం చేయబడుతున్నవి. పారిశుద్ధ్యం విషయంలో చూసినప్పుడు స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా మరుగుదొడ్లు నిర్మించడానికి సహాయం చేయడం జరిగింది. కానీ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడకుండా నామమాత్రంగా నిర్మించబడిన మరుగుదొడ్ల ఉపయోగం నిరుపయోగమైంది. ఇలాంటి కొలమానాలన్నీ పేపర్‌ మీద పులుల్లా కనిపిస్తాయి, క్షేత్రస్థాయిలో పరిశీలించి నప్పుడు అవి ప్రకటించబడిన స్థాయిని చేరుకోవడానికి చాలాకాలం పడుతుందని అవగతం అవుతుంది. సగటున ఒక్కో రాష్ట్రంలో 6వేల మంది బాల కార్మికులున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
తలసరి ఆదాయం లక్షా 73 వేల కోట్ల రూపాయలు అని అధికారికంగా ప్రకటించిన భారతదేశంలో 95శాతం జనాభా సగటు సాలిన ఆదాయం లక్ష ఇరవై వేలకు మించలేదన్నది కూడా నమోదైంది. ఇవన్నీ ప్రస్తావిం చడం దేశాన్ని తక్కువ చేయడం కోసమో లేదా నిరాశావాహ దృక్పథాన్ని వెలిగించడం కోసమో కాదు, గణాంకాలు వాస్తవ పరిస్థితులను ఎలా ప్రతిబింబించలేవో చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. తాజాగా, ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌పై ఒక నివేదిక వెలువడినది. దాని ప్రకారం ప్రపంచంలో 6.8కోట్ల ఉద్యోగాలు ఊడిపోతే 8.6 కోట్ల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడ్డాయి. దీని ప్రకారం కొత్త ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉన్నదని అర్థం అవుతుంది. కానీ జరిగిందేమంటే ఊడిపోయిన 6.8 కోట్ల మందిలో తిరిగి ఉపాధి పొందిన వారి సంఖ్య నామమాత్రం. ఇలా ఎందుకు జరిగింది అంటే అధిక జీతాలు పొందుతున్న సీనియర్లను తొలగించి నిరుద్యోగంతో అల్లాడుతున్న కొత్త వారిని తక్కువ జీతాలకు నియమించుకొని అధిక లాభాలు గడించడానికి కొత్త కంపెనీలు వేస్తున్న పన్నాగం. ఉపాధి స్థిరీకరణపై ప్రభుత్వాలకు సరైన నియంత్రణ లేకపోవడం వల్ల ఈ రకమైన అనిశ్చిత స్థితి ఏర్పడి ఫలితంగా నిన్న పేదరికానికి పైన ఉన్న వ్యక్తి నేడు బిపిఎల్‌ కిందకి పడిపోతున్న సందర్భంగా ఉన్నది. దేశం వెలిగిపోతుందని చెప్పే కేంద్ర పెద్దలు, తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో దారిద్య్రం రాజ్యమేలు తున్నదని చెప్పడానికి వెనుకాడరు. గణాంకాలకూ వాటిని అన్వయించే వారికి మధ్య అభివృద్ధి మందగిస్తుండటం వాస్తవం.

జి.తిరుపతయ్య
9951300016