జడ్జిల నియామకంలో అంతుపట్టని జాప్యం

Inexorable delay in appointment of judgesభారతదేశంలో న్యాయమూర్తుల నియా మకం సమస్య కేంద్రం ఏకపక్ష వైఖరి వల్ల మరొకసారి వివా దంగా మారింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ డివై చంద్రచూడ్‌ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు కోర్టు ఆగ్రహాన్ని వెల్లడించాయి. ముగ్గురు సీనియర్‌ న్యాయ మూర్తులతో కూడిన కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను పక్కన పెట్టడానికి కారణం ఏమి టని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. కొలీజియం కేవలం సెర్చి కమిటీ లాంటిది కాదు. కొలీజియంకు రాజ్యాంగ పరమైన కొన్ని బాధ్యతలున్నాయి. దాని సిఫార్సులను ఆమోదించవచ్చు లేదా తోసిపుచ్చవచ్చు. కానీ సిఫార్సు చేసినప్పుడు దానిపై ఏదో ఒక స్పందన చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. వాటిపై ఎడతెగని ఆలస్యం చేసి గుండుగుత్తగా వెనక్కు పంపితే ఏమని అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రశ్నిం చింది. ఈ వారం మొదట్లో హైకోర్టులకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులు పలువురిని కొలీజియం సిఫార్సు చేసింది. అంతకుముందు చేసిన సిఫార్సులను కేంద్రం సలహా మేరకు మార్చింది కూడా. ఢిల్లీ హైకోర్టుకు జస్టిస్‌ సుకుమార్‌, సురేష్‌ కుమార్‌ పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు జస్టిస్‌ శాంతాబాయి అను జమ్మూ కాశ్మీర్‌ లడక్‌ హైకోర్టుకు జస్టిస్‌ దర్శి రాబట్‌సన్‌ పంపించాలంటూ చేసిన సిఫార్సులను వెనక్కు తీసుకోవ డానికి కూడా న్యాయస్థానం సిద్ధపడింది. రెండో జడ్జిల కేసులో తీర్పు ప్రకారమైతే ఒకసారి పంపిన పేర్లను మళ్లీ పరిశీలన తర్వాత కూడా కొలీజియం పంపినట్టయితే ప్రభు త్వం తప్పనిసరిగా ఆమోదించి తీరాలి. న్యాయవ్యవస్థతో సంబంధం ఉన్నవారు ఎవరైనా ఈ ధోరణి వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి భంగకరమని భావిస్తారు ఆ విధమైన విమర్శలు అభ్యం తరాలు నిరసనలు చాలానే వచ్చాయి. కొలీజియం పంపిన పేర్లపై కేంద్రం నిర్ణయం తీసుకోవ డానికి నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలంటూ దాఖలైన పిల్‌ విచారణ సందర్భంగా ఈ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. జార్ఖండ్‌ ప్రభు త్వం దాఖలు చేసిన ఇలాంటి మరో పిటిషన్‌ కూడా వచ్చింది. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావును నియమించాలని కొలీజియం చేసిన సిఫార్సును ఎంతకు తేల్చకపోవడంపై అది అభ్యంతరం చెప్పింది.
కేంద్రం తరపున వాదించిన అటార్నీ జనరల్‌ ఆరు వెంకటరమణి మాత్రం అసలు ఈ విషయంలో కోర్టు జోక్యం ఏమేరకు సాధ్యమని సందేహం వెలిబుచ్చారు. దానిపై ఆగ్రహించిన సీజేఐ చంద్రచౌదరి అసలు ఈ నియామకాలు జరపకపోవడానికి కారణాలేంటో ముందు చెప్పండని ప్రశ్నించారు. ‘మేము పంపిన సిఫార్సులలో ఒక్కొక్క దాని పరిస్థితి ఏంటో మాకు వివరాలతో సహా నివేదించండి. ఇవన్నీ చెప్పడంలో మా ఉద్దేశం తప్పులు పట్టడం కాదు, న్యాయస్థానాల పాలన నిర్వహణకు సంబం ధించిన వ్యవహారాల్ని ముందుకు తీసుకోవడం కోసమే ఈ మాట చెప్తున్నామని’ సీజేఐ అటార్నీ జనరల్‌తో అన్నప్పుడు నాకు బాగా అర్థమైందని ఆయన బదులిచ్చారు. అయితే అసలు ఇలాంటి పిటిషన్‌ విచారణ అర్హత కలిగివుందో లేదో తన అభిప్రాయం ఒక నోట్‌ రూపంలో అంద జేస్తానని వ్యాఖ్యానించారు. ‘మీరు సున్నితమైన విషయాన్ని మరి లాగకండి. కావాలంటే జార్ఖండ్‌ కేసు వాదిస్తున్న కపిల్‌ సిబాల్‌ గారే నియామకాల ప్రక్రియ చేపట్టవచ్చు. ప్రతి సిఫార్సు ఆనామోదానికి ఒక ప్రత్యేక కారణం ఉంటుందంటూ’ కేంద్రాన్నే సమర్థించడానికి ఏజీ వెంకట రమణి ప్రయత్నించారు. ‘ఒకచోట ఒకరు పేచీ పెడతారు అది ఎందుకు చేయకూడ దంటారు. వీటన్నిం టిలో కోర్టు ఎలా తలదురుస్తుందో నేను చెప్పలేను.’ అని సుప్రీంకోర్టు పాత్రనే ప్రశ్నించినట్టు మాట్లాడారు.
దీర్ఘకాల సంక్షోభం
ఈ వాదోపవాదాలు యాదచ్చికమైన వని భావించడం కష్టం. దీర్ఘకాలంగా తేలని కొలీజియం కేంద్రం సంబంధాలు సమస్య దీంతో ముడిపడి ఉంది. ఉదయం కేసు ప్రారంభం కాగానే ఏజీ వెంకటరమణి వాయిదా వేయాలని కోరారు. ఈ విషయంలో 2018 నాటి నుంచి విచారణకు నోచని పిటిషన్‌లు కూడా వున్నాయని అడ్వకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ గుర్తుచేశారు. జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంపై పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తనకు తెలియదని ఎజి చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులు కీలకమైన పాలనా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. దాన్ని వాయిదా వేస్తూ తాత్కాలిక సిజెతో నడిపించడం సమస్యలకు దారితీస్తుందన్నారు. నిర్ణీత కాలంలో కొలీజి యన్‌ సిఫారసులను ఆమోదించకపోతే ఆ నియామకాలు జరిగిపోయినట్టే భావించాలని ఈ సందర్భంగా ప్రశాంత్‌ భూషణ్‌ సూచించారు. నిజానికి రెండవ జడ్జీల కేసుగా పేరుపొందిన కేసులో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు గనక రెండోసారి పంపినట్టయితే ప్రభుత్వం ఆమోదించి తీరాలని ఆదేశిస్తున్నది. మళ్లీ మళ్లీ పంపిన పేర్లను కూడా విస్మరించటం, తిరగ్గొట్టడం రెండవ జడ్జీల కేసు తీర్పు స్ఫూరికి విరుద్ధమని డిసెంబర్‌ 2022లో ఇచ్చిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడైతే ఢిల్లీ హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మద్రాస్‌, మేఘాలయ హైకోర్టులకు జడ్జిలను నియమిం చవలసి వుంది.ఢిల్లీ హైకోర్టులో సౌరభ్‌ కిర్పాల్‌ నియా మకం దీర్ఘకాలంగా పక్కన పెట్టారని అడ్వకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు.ఇలా తొక్కిపట్టిన 12 పేర్లను తాను పిటిషన్‌లో ఉదహరించానని ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. తనను గనక నియమించి ఉంటే భారత దేశంలో మొదటి గే జడ్జి ఉండేవారు. అతని పేరు ఆయన పేరును ఢిల్లీ హైకోర్టు కొలీజియం 2017 ల్లో పంపించింది. కొలీజియం 2021 నవంబర్‌లో సిఫార్సు చేసింది. 2023 జనవరిలో మరోసారి చెప్పింది. కానీ స్వలింగ సంపర్కుల హక్కులను గట్టిగా వాదించే కిర్పాల్‌ నియామకానికి కేంద్రం అభ్యం తరం పెట్టింది. మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా జాన్‌ సత్యంను సుప్రీంకోర్టు కొలీజియం 2022 ఫిబ్రవరిలో సిఫార్సు చేసింది. 2023 జనవరిలో పునరుద్ఘాటించింది. అయినప్పటికీ ఇవి జరగ లేదు. జార్ఖండ్‌ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ బిఆర్‌ సారంగి పేరును ఆలస్యంగా ఖరారు చేయడంవల్ల ఆయన 15రోజులు మాత్రమే సిజెగా పనిచేసి దిగిపోవాల్సి వచ్చింది!
రాజకీయ అభ్యంతరాలా?
ఇంతకంటే తీవ్రమైనవి రాజకీయ ఆటంకాలు. 2024 ప్రారంభంలో కొలీజియం పిఎం మాధవన్‌ను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేస్తే కేంద్రం అడ్డుపడింది. ఆయన సీపీఐ(ఎం) అభిమాని అనీ, రెండుసార్లు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఆయన్ను ప్రభుత్వ న్యాయవాదిగా నియమించిందనీ సిఫార్సు వెనక్కు పంపింది. అయితే ఆయన సీపీఐ(ఎం) అభిమాని అనే వాదన అస్పష్టమైందని కొలీజియం మార్చి 13న బదు లిచ్చింది.ఫలానా రాజకీయ నేపథ్యంతో వున్నారనే ఒక్క కారణంగా అన్ని సందర్భాల్లో వారి నియామకాన్ని తిరస్కరించలేమని పేర్కొంది. లంకేశ్‌చంద్రగౌరి బీజేపీలో ఆఫీసుబేరర్‌గా వున్నా 2023 ఫిబ్రవరిలో ఆమెను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా నియమించిన సంద ర్భాన్ని పేరు తీయకుండా కొలీజియం గుర్తుచేసింది. నిజానికి గౌరి చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా వున్నాయి గనక నియామకం చేయవద్దంటూ ఆమె ప్రమాణ స్వీకారానికి ముందే సుప్రీం కోర్టుకు అనేక లిఖిత అభ్యంతరాలు వెళ్లినా కొలీజియం ఖాతరు చేయలేదు. ఆ విధంగా చూస్తే ఎస్‌సి వర్గానికి చెందిన మాధవన్‌ 35 మంచి తీర్పులు ఇచ్చారని కొలీజియం స్పష్టం చేసింది. పైగా ఆయన ప్రభుత్వం ఒక పక్షంగా వుండే కేసుల ద్వారా భిన్న సందర్భాలలో ఎలా వ్యవహరించాలో కూడా అనుభవం గడించి వుంటారని అభిప్రాయపడింది. కేరళ హైకోర్టులో ఆయనతో పాటు పనిచేసిన జడ్జిలు మాధవన్‌ సమర్థత గురించి సంతృప్తి వెలిబుచ్చారని కూడా తెల్పింది. హైకోర్టులకు సంబంధించినంతవరకూ ఎస్‌సి కొలీజియం కేంద్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో నుంచి నివేదికలు వచ్చిన తర్వాత మాత్రమే తనకు అందిన ప్యానల్స్‌ నుంచి పేర్లను షార్ట్‌లిస్ట్‌ ఎంపిక చేస్తుంది.వాటిపై అభ్యంతరాలుంటే తెలియజేయాలి. అప్పుడు కొలీజియం వాటితో ఏకీభవిం చడం లేదా పునరుద్ఘాటించడం చేస్తుంది. ఏ కారణం లేకుండా ఆలస్యం చేయడమేమిటనేది ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్‌ ప్రశ్న. ఒత్తిడి అవాంఛనీయం
వేర్వేరు హైకోర్టులకు అదేవిధంగా సుప్రీం కోర్టుకు నియామకాలు చేసే సమయంలో ఇలాంటి చాలా ప్రశ్నలు అడ్డం రావడం ఇటీవలికాలంలో బాగా పెరి గింది. సుప్రీం కోర్టుకు ఒరిస్సా మాజీ సిజె జస్టిస్‌ మురళీ ధరన్‌ను ఒకటికి రెండుసార్లు సిఫార్సు చేసినా ఆమోదించకపోవడం ఇలాంటి వాటిలో బాగా విమర్శకు గురైంది. ఎన్ని అర్హత లున్నా తనను సుప్రీంకోర్టుకు రానివ్వకుండానే పదవీ విరమణ చేయించడం ఉద్దేశపూర్వకమేనని న్యాయ వర్గాలు నిర్ధారిస్తున్నాయి. 1982లో ఎస్‌పి గుప్తాకు సంబంధించిన మొదటి జడ్జిల కేసు,1993లో సుప్రీంకోర్టు అన్‌ రికార్డ్‌ అడ్వకేట్సు కేసు,1998లలో మూడవ జడ్జిల కేసు, వీటన్నిటిలోనూ అత్యున్నత న్యాయస్థానం తన వైఖరిని చెబుతూ వస్తున్నది. 2014లో నేషనల్‌ జ్యుడిషి యల్‌ అపాయింట్‌మెంట్స్‌ కేసులో జ్యుడిషియల్‌ కమిషన్‌ నియా మకాన్ని కోర్టు నిలిపేసింది. జడ్జిలే జడ్జిలను నియమిం చుకునే పద్ధతి కాకుండా అందుకు సమగ్రమైన జ్యుడిషి యల్‌ కమిషన్‌ వుండాలనేది వాస్తవమే. అయినా మోడీ ప్రభుత్వం ఆ పేరుతో కేవలం నియామాకాలు మొత్తంగా తన చేతిలోకి తీసుకోవాలనే రీతిలో వ్యవ హరిం చడం కూడా సరైంది కాదు. సమగ్ర సంస్కరణలతో కూడిన కమిషన్‌ కాకుండా తనకు నచ్చిన విధంగా ఆ కమిషన్‌ను రూపొందించాలను కోవడం అవాంఛనీయం. దీనికి తోడు ప్రధాని మోడీ, మంత్రులూ తరచూ న్యాయ వ్యవస్థపై చేసే వ్యాఖ్యలు దాన్ని మరింత పెంచాయి. ఇక ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంకర్‌ ఆ పదవి పరంగానూ, రాజ్యసభ చైర్మన్‌ హోదాలో కూడా నేరుగా కోర్టులను సవాలు చేసేట్టు మాట్లాడుతుంటారు.ఒక సందర్భంలో ఆయన మాటలను కోర్టు ధర్మాసనం దాదాపు సూటిగానే ఖండించిన ఉదంతాలున్నాయి. అయినా ఇటీవల కూడా సిబిఐపై, ఎన్నికల సంఘంపై వ్యాఖ్యానాలు చేయకూడదని ఆయన సెల విచ్చారు.మొత్తంపైన అటూ ఇటూ వాదనలు ఎలావున్నా న్యాయమూర్తుల నియామ కంలో జాప్యం, కేంద్రం జోక్యం వంటి అనేక విమర్శలు అనుభవాల రీత్యా న్యాయవ్యవస్థ స్వతంత్రతనూ, ప్రజా స్వామిక నియామక ప్రక్రియనూ సమతుల్యం చేయడం చాలా అవసరమనేది నిర్వివాదాంశం. పైగా కేంద్రం చేసే ఎడతెగని ఆలస్యం న్యాయాన్ని మరింత అందకుండా కేసులు గుట్టలు పడటానికి కారణమవుతున్నది.మరి ప్రస్తుతం జరుగుతున్న విచారణలో మరోసారి కేంద్రం ఏం చెబుతుందో, సుప్రీం కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో వేచిచూడాల్సిందే.

– తెలకపల్లి రవి