– క్యూ1లో రూ.5,945 కోట్ల లాభాలు
– తగ్గిన ఉద్యోగుల సంఖ్య
బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ వృద్థి అంచనాలను తగ్గించుకుంది. ఇంతక్రితం 4-7 శాతం వృద్థి ఉండొచ్చని అంచనా వేయగా.. తాజాగా దీన్ని 1-3.5 శాతానికి కోత పెట్టుకుంది. గురువారం ఆ కంపెనీ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్బంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 10.9 శాతం వృద్థితో రూ.5,945 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,360 కోట్ల లాభాలు ఆర్జించింది. గడిచిన క్యూ1లో కంపెనీ రెవెన్యూ 4.2 శాతం పెరిగి రూ.37,933 కోట్లుగా నమోదయ్యింది. 2023 జూన్ ముగింపు నాటికి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల సంఖ్య 3,36,294కు తగ్గింది. ఇంతక్రితం మార్చి ముగింపు నాటికి ఈ సంఖ్య 3,43,234 గా ఉంది. బిఎస్‌ఇలో ఇన్ఫోసిస్ షేర్ 1.73 శాతం తగ్గి రూ.1,448.85 వద్ద ముగిసింది.