భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

– కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి దేవస్థాన పాలక మండలి సమావేశం నిర్వహించడం దేనికి సంకేతం
– కబ్జాలకు గురౌతున్న స్థలాలను కాపాడాలని సీపీఎం వినతి
నవ తెలంగాణ కొమురవేల్లి
‘కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి భూములను కాపాడండి. దేవాలయ పరిసర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. దేవస్థాన పాలకమండలి సమా వేశంలో కాంగ్రెస్‌ జనగామ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి పాల్గొన్న విషయంపై విచారణ చేయించండి. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని సీపీఎం కొమురవేల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో దేవాదాయ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సీపీఎం కొమురవేల్లి మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ ‘మల్లికార్జున స్వామి దేవాలయానికి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. దేవాలయ పరిసర ప్రాంతాలలో పార్కింగ్‌ స్థలం సరిపోను లేకపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో దేవాలయానికి కేటాయించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే నాథుడే లేదు. భూములకు రక్షణ లేకుండా పోతున్నది. కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించడానికి రాజకీయ నాయకుల అండతో కొంతమంది రియల్టర్లు ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే దేవాలయ భూములకు హద్దులు ఏర్పాటు చేసి చుట్టూ గోడ నిర్మించి దేవాలయ భూములను కాపాడాలి. దేవాలయానికి వచ్చే భక్తులకు దేవస్థానం పరిసర ప్రాంతాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్‌ బాత్రూంలు, తాగునీరు, వీధిలైట్లు కల్పించడంలో దేవస్థానం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే భక్తులకు సరిపోను మొబైల్‌ టాయిలెట్స్‌ బాత్రూంలు ఏర్పాటు చేయాలి. తాగునీరు అందించాలి. పరిసర ప్రాంతాలలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెల 12వ తేదీన దేవాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశానికి కాంగ్రెస్‌ జనగామ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డి ఏ హౌదాతో పాల్గొన్నారు. దేవాలయంలో రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించకూడదు. ఆ రోజు దేవాలయంలో కాంగ్రెస్‌ సమావేశం నిర్వహించిన కొమ్మూరు ప్రతాప్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలి. ఈ సమావేశానికి పర్మిషన్‌ ఇచ్చిన ఈవోపై చర్య తీసుకోవాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బద్దీపడిగా కష్ణారెడ్డి, రాంసాగర్‌ సర్పంచ్‌ తడూరి రవీందర్‌ , దాసరి ప్రశాంత్‌ కొమురవేల్లి మండల నాయకులు తెలు ఇస్తారి,బక్కెలి బాలకిషన్‌ ,తడూరి మల్లేశం, సాయిలు, నీల బిక్షపతి సార్ల నర్సింలు, కరోళ్ల ఎల్లయ్య, దాసరి చక్రపాణి బోడిగాం రాంరెడ్డి, అల్లం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.