విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి

– గురుకుల జేఏసీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మొత్తం గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో సుమారు 662 వరకు అద్దెభవనాల్లో నడుస్తున్నాయనీ, ఆ రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని గురుకుల జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం జేఏసీ అధ్యక్షులు మామిడి నారాయణ, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ మధుసూదన్‌, ఎస్‌ డబ్ల్యూ అధ్యక్షులు నరసింహులు గౌడ్‌ , ఎస్టీ డబ్ల్యూ జనరల్‌ సెక్రెటరీ గణేష్‌, బిక్షం యాదవ్‌, వేదాంతా చారి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వెంటనే రూ. ఐదు వేల కోట్లకు పరిపాలన ఉత్తర్వులు ఇస్తూ ఈనెల 11న 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి చేపడుతున్నందున గురుకుల విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ చర్య వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్య దూరమవుతుందని తెలిపారు. సమయ పాలన సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.పెరిగిన ధరలకనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని కోరారు. గురుకుల జేఏసీ, టీఎస్‌ యుటిఎఫ్‌ సంయుక్తంగా సమర్పించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.