– పొత్తిళ్ల శిశువును ప్రాణంతోనే మట్టిలో పూడ్చివేత
– లారీ డ్రైవర్ చొరవతో ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-దామెర
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుకొండలో అమానుష సంఘటన వెలుగుజూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 163 జాతీయ రహదారి పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును రోడ్డు పక్కన కొద్దిపాటి మట్టిలో గుర్తుతెలియని వ్యక్తులు పూడ్చిపెట్టారు. అటుగా వెళ్లిన లారీ డ్రైవర్ గమనించి స్థానికులకు చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ కొంక అశోక్, హోంగార్డు కుమారస్వామి ఘటన స్థలానికి వెళ్లారు. అప్పటికే లారీ డ్రైవర్ శిశువుని మట్టిలో నుంచి తీసి ఒక వస్త్రంలో పడుకోబెట్టాడు. ఎస్‌ఐ శిశువును తన వాహనంలోనే దగ్గరలో ఉన్న ఎన్‌ఎస్‌ఆర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పరకాల రూరల్ సీఐ రంజిత్‌రావు శిశువు ఆరోగ్యం గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి శిశువును కాపాడిన లారీ డ్రైవర్‌ను, ఎస్‌ఐని, హోంగార్డును సీఐ అభినందించారు. కేసు దర్యాప్తులో ఉంది.