దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం

Initiate a nationwide movement– హైదరాబాద్‌ కేంద్రంగా దళిత్‌ సమ్మిట్‌
– బీజేపీ విధానాలను ఓడించడమే లక్ష్యం
– విశాల ఐక్యవేదిక నిర్మాణానికి పునాది :బి.వెంకట్‌
దళిత ఎజెండా సమ్మిట్‌కు హైదరాబాద్‌ కేంద్రమైంది. దళితులపై దాడులు పెరగడం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితి మరింత దిగజారిన నేపథ్యంలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఈ సమ్మిట్‌కు పూనుకున్నది. ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌ బేగంపేటలోని ది ప్లాజా హౌటల్‌లో నిర్వహించనున్న సమ్మిట్‌కు 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 350 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. రెండు రోజుల పాటు దళితుల గురించి సమ్మిట్‌ చర్చించనున్నది. అవసరమైన కార్యాచరణ ప్రణాళిక, దళితులకు న్యాయం చేసేందుకు అవసరమైన రాజకీయ పోరాటంపై ఒక నిర్ణయానికి రానున్నది. సమ్మిట్‌ నేపథ్యంలో ఆల్‌ ఇండియా అగ్రికల్చర్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ నవతెలంగాణ ప్రతినిధి కె.ప్రియకుమార్‌కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న… జాతీయ దళిత్‌ సమ్మిట్‌ లక్ష్యమేంటి?
బి.వెంకట్‌… దేశంలో 27 కోట్ల నుంచి 29 కోట్ల మంది దళితులున్నారు. సంఖ్య రీత్యా కోట్లలో ఉన్న దళితులు ఉత్పత్తి తరగతులు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు, చిన్న, సన్నకారు రైతులు, పట్టణ ప్రాంతాల్లో అసంఘటిత కార్మికులున్నారు. సంఖ్య రీత్యా, ఉత్పత్తి తరగతులుగా వారు భారత జీడీపీని సృష్టించడంలో వారిది కీలక పాత్ర. అలాంటి దళితులు దేశంలో ఆర్థిక దోపిడీ, సామాజిక వివక్ష, సాంస్కృతిక రంగంలో అణచివేతకు గురవుతున్నారు. ప్రపంచంలో లేని ఒక ప్రత్యేక దుస్థితి …కులం పేరుతో అణచివేత మన దేశంలో ఉంది. అందుకే ఈ సమ్మిట్‌ ఉత్పత్తికారులకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారి కోసం జరుగుతున్నది. వారి గురించి చర్చిస్తున్నది. మన అభివృద్ధి కారకులుగా దళితుల గురించి మాట్లాడుతున్నాం.
ప్రశ్న… ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మిట్‌ ప్రాధాన్యత ఏమిటీ?
బి.వెంకట్‌…. గతం నుంచి పాలకవర్గాలు దళితులను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పటికీ అది కొనసాగుతున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్దతుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో దళితుల హక్కుల మీద, వారికి అనుకూలమైన రాజ్యాంగ అంశాలపైన దాడి చేస్తూ వాటిని విధ్వంసం చేస్తున్నారు. ఈ విధ్వంసం సాధారణమైనది కాదు. ప్రభుత్వరంగాన్ని విధ్వంసం చేయడమంటే దళితులకు రిజర్వేషన్లు లేకుండా వారికి ఉన్న అవకాశాలను రద్దు చేయడమే. క్రమంగా ఆధిపత్య తరగతుల దౌర్జన్యాలను ప్రతిఘటించకుండా చూడడం. వ్యవసాయ కార్పొరేటీకరణ అంటే చిన్న, సన్నకారు రైతుల చేతుల్లోని భూమి కంపెనీల చేతుల్లోకి పోతుంది. దీంతో దళితులకే ఎక్కువ నష్టం. ప్రభుత్వ భూములన్ని కంపెనీల చేతుల్లోకి పోతాయి. దళితులు, వ్యవసాయ కార్మికులు నూతన వెట్టి కార్మికులుగా వెట్టిచాకిరీకి గురవుతారు. దాంతో దళితుల్లో నిరుద్యోగం, వలసలు పెరుగుతాయి. ఇప్పుడున్న కొనుగోలు శక్తి కూడా ఉండదు. రాజ్యాంగం దళితులకు కల్పించిన హక్కులన్నీ రద్దవుతాయి. సెక్యులర్‌ రాజ్యాంగాన్ని మనువాద, హిందుత్వ రాజ్యాంగంగా మార్చి, నూతన రూపంలో దళితులపై కుల ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. దళితులపై మూడు వైపుల నుంచి దాడి జరుగుతున్నది. ఆర్థిక పరమైన దోపిడీ, సామాజిక దాడి, హిందుత్వ దాడి. ఈ నేపథ్యంలో వాటిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. అందుచేత సమ్మిట్‌కు ప్రాధాన్యత ఉంది.
ప్రశ్న….ఎంత మంది పాల్గొంటారు? ఎన్ని రోజులు చర్చిస్తారు?
బి.వెంకట్‌ …. హిందుత్వాన్ని, కేంద్ర బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారై ఉండాలి.దళితుల సమస్యలపై పని చేసే వారై ఉండాలి. అలాంటి వారితో సమ్మిట్‌ నిర్వహణ ఉంటుంది. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వంద సంఘాలు, సంస్థల నుంచి 350 మంది ప్రతినిధులు హాజరు కావచ్చు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కాకి మాధవరావు ఆధ్వర్యంలో ఆహ్వాన సంఘం ఏర్పడింది. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య జాతీయ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తే సముచితంగా ఉంటుందని సూచించారు. సామాజిక ఉద్యమాలు, అభ్యుదయ భావాలకు హైదరాబాద్‌కు చారిత్రక నేపథ్యం ఉన్నది. ఆ వారసత్వాన్ని కొనసాగించాలి. దళిత చైతన్యానికి, దళిత ఐక్యతకు, ఇతర ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములైన అనుభవం ఉంది. భారత దేశంలో మొదటి సారిగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ సాధించిన చరిత్ర తెలుగు ప్రజలది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ పోరాట సాధన సమితికి సబ్‌ ప్లాన్‌ గురించి మల్లేపల్లి లక్ష్మయ్య సూచనలు చేశారు. దళితుల విముక్తి పోరాటాల్లో అభ్యుదయవాదులు భాగస్వాములైన చరిత్ర తెలుగు ప్రజలది. దళితుల హక్కులు, రాజ్యాంగానికి సవాలుగా నిలిచిన హిందుత్వ శక్తులు తెలంగాణలోనూ విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో హైదరాబాద్‌లో సమ్మిట్‌ నిర్వహించాలని నిర్ణయించాం.
ప్రశ్న …రెండు రోజుల పాటు షెడ్యూల్‌ ఎలా ఉంటుంది..?
బి.వెంకట్‌… దళిత ఎజెండా తయారు చేయడమే లక్ష్యంగా జరిగే రెండు రోజుల సమ్మిట్లో మొదటి రోజు ప్రారంభ సభ ఉంటుంది. వ్యవసాయ కార్మికుల నుంచి సంఘటిత కార్మికుల వరకు సమస్యలు – పరిష్కారాలు, దళిత ఎజెండా చర్చాపత్రంపై చర్చిస్తాం. హర్యానా ప్రభుత్వ అడిషనల్‌ చీఫ్‌ సెక్రెటరీ రాజశేఖర్‌ ఒండ్రూ డిస్కషన్‌ పేపర్‌ను ప్రవేశపెడతారు. చర్చ అనంతరం అందరి అభిప్రాయాలతో ఎజెండా రూపొందిస్తాం. ఒండ్రుతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి పాల్గొంటారు. 27న మధ్యాహ్నం ముగింపు సమావేశంలో యుజీసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ థొరాట్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. దళిత ఎజెండా, దేశవ్యాప్త ఉద్యమ కార్యాచరణ, ఐక్య ప్రజా ఉద్యమంపై చర్చిస్తాం.