ఉదయం లేలేత చిగురుటాకులపై
సూర్య కిరణాల కాంతి ప్రసరిస్తే
మామిడి పూతల చిటారు కోమ్మపై కోకిల
వసంత ఋతురాగాన్ని ఆలాపిస్తుంది..!
భానుడి భగ భగలను లెక్క చేయకుండా
చికాకుల చెమటతో సహవాసం చేస్తూ
పని ఒత్తిడిలోని సమస్యల పరిష్కారానికి
గ్రీష్మ తాపం ఆలోచనల సెగ పుట్టిస్తుంది..!
తొలి చినుకుల సంబురంతో
మనసు కోరికల మయూరం
ఉత్సాహంతో పరవశించి పురి విప్పుకుని
వర్షం వేదికపై నాట్యమాడుతుంది..!
తుమ్మెద మోసుకు వచ్చిన
పువ్వుల మధువును స్వాగతించి
చల్లని గాలుల స్పర్శకి స్పందించి
శరత్ కాలపు వెన్నెల ఊరటనిస్తుంది..!
ఓర్పుతో దినమంతా శ్రమిస్తూ
చీకటి రాత్రులలో వెచ్చగా విశ్రమిస్తూ
నేర్పుతో ఇష్టాలను పండించుకుని
హేమంతం తియ్యని విందు చేస్తుంది..!
అన్నీ బాగానే ఉన్నాయని
ఏమరుపాటుతో ఒళ్లు విరుస్తున్నపుడు
ఆశగా కట్టుకున్న రంగుల కల
శిశిరమై ఒక్కోసారి రాలుతుంది..!
అయినా కాలం గీసిన రేఖలపై
మార్పులకు ఎదురోడ్డి నిలిచి
వసంతంలో మళ్లీ మొగ్గ తొడిగి
షట్ ఋతువులలో షడ్రుచుల జీవనం
యుగాదికి శ్రీకారం చుడుతుంది..!!
– డా. వాసాల వరప్రసాద్, 9490189847