రోహిత్‌కు గాయం?

Injury to Rohit?– ప్రాక్టీస్‌లో మోకాలికి గట్టి దెబ్బ
– ఆకాశ్‌ దీప్‌కు సైతం గాయం
నవతెలంగాణ-మెల్‌బోర్న్‌
ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టు సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీమ్‌ ఇండియా సిద్ధమవుతోంది. మెల్‌బోర్న్‌లో ప్రతికూల ఘటనలను చవిచూస్తున్న టీమ్‌ ఇండియాకు ఆదివారం నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్లోనూ అదే పునరావృతం అయ్యింది. మెల్‌బోర్న్‌ విమానాశ్రయంలో విరాట్‌ కోహ్లి తన కూతురు ఫోటోలను తీసిన మీడియాతో వాదనకు దిగగా.. శనివారం రవీంద్ర జడేజా భారత మీడియాతో మాట్లాడుతుండగా ‘ఇంగ్లీష్‌’లో సమాధానం ఇవ్వటం లేదని కంగారూ మీడియా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. నెట్స్‌లో సాధన చేస్తుండగా రోహిత్‌ శర్మ మోకాలు గాయానికి గురవగా, ఆకాశ్‌ దీప్‌ మోచేతికి దెబ్బ తగిలింది. రోహిత్‌ శర్మ, ఆకాశ్‌ దీప్‌ గాయం పెద్ద విషయం కాదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించినా.. గ్రౌండ్‌లో రోహిత్‌ శర్మ మోకాలుకి ఐస్‌ప్యాక్‌తో మర్దన చేసుకోవటంతో అభిమానుల్లో కాస్త ఆందోళన వ్యక్తమైంది.
స్పిన్‌ ఆడుతూ…
రోహిత్‌ శర్మ మానసికంగా మిడిల్‌ ఆర్డర్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. కెఎల్‌ రాహుల్‌ కోసం ఓపెనర్‌ స్థానాన్ని త్యాగం చేసిన రోహిత్‌ శర్మ.. ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌ టెస్టుల్లో మిడిల్‌ ఆర్డర్‌లో వస్తున్న సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్‌ నెట్స్‌లో కెఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి సహా శుభ్‌మన్‌ గిల్‌ కొత్త బంతితో సాధన చేశారు. మెరుపుతో కూడిన బంతితో పేసర్లను టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఆడుతుండగా.. పక్కనే మరో నెట్స్‌లో రోహిత్‌ శర్మ స్పిన్‌ ఆడుతూ కనిపించాడు. ఓ బంతిని తన ఫేవరేట్‌ ఫుల్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా లో బౌన్స్‌తో అది నేరుగా మోకాలుకు గట్టిగా తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి రోహిత్‌ శర్మ తక్షణ చికిత్స అందించాడు. మోకాలు గాయం కావటంతో ఐస్‌ ప్యాక్‌ను ఉంచి గాయం తీవ్రత తగ్గించేందుకు చూశారు. ఆ తర్వాత సాధారణంగా గ్రౌండ్‌లో తిరుగుతూ, సహాయక సిబ్బందితో మాట్లాడుతూ రోహిత్‌ శర్మ ఉత్సాహంగానే కనిపించాడు. ఆకాశ్‌ దీప్‌ సైతం నెట్స్‌లో బ్యాటింగ్‌ చేశాడు. అతడు సైతం పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ చేతి గాయానికి గురయ్యాడు. ఇటువంటి గాయాలు క్రికెట్‌ సాధారణమని, ఎటువంటి ఇబ్బంది లేదని ఆకాశ్‌ దీప్‌ మీడియాతో తెలిపాడు.
కొత్త బంతిపై ఫోకస్‌
ఆస్ట్రేలియాలో కొత్త బంతిని ఎదుర్కొవటం కఠిన సవాల్‌. టీమ్‌ ఇండియా టాప్‌ ఆర్డర్‌ తొలి మూడు టెస్టుల్లో ఈ అంశంలో వెనుకంజ వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు నిలకడగా విఫలం అవుతున్నారు. ఆసీస్‌ పిచ్‌లపై కొకాబురా బంతులు 20-30 ఓవర్లలో మెత్తబడతాయి. మెరుపు పోయి, మెత్తబడిన బంతితో పేసర్లు నిప్పులు చెరగలేదు. ఈ సమయంలో బ్యాటర్లకు పరుగుల వేట సులభతరం అవుతుంది. కానీ, ఆ 20-30 ఓవర్ల పాటు కొత్త బంతితో కంగారూ పేసర్లను కాచుకోవటమే అసలు సమస్య. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ కీలక ఘట్టానికి చేరుకోవటం, 1-1తో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలువటంతో భారత బ్యాటర్లు నెట్స్‌లో కొత్త బంతిపై ఫోకస్‌ పెట్టారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, కెఎల్‌ రాహుల్‌ సహా విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌లు నెట్స్‌లో కొత్త బంతిపై సాధన చేశారు. కాస్త పచ్చిక ఎక్కువగా ఉన్న ప్రాక్టీస్‌ పిచ్‌లను ఎంచుకున్న టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు.. త్రో డౌన్స్‌తో పాటు భారత పేసర్లను నెట్స్‌లో ఎదుర్కొన్నారు. యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ సహా విరాట్‌ కోహ్లి ఫామ్‌ కోల్పోయినట్టు కనిపించరు. కానీ వేగంగా పరుగులు పిండుకోవాలనే తపనలో అనవసర షాట్లు ఆడుతున్నారు. మెల్‌బోర్న్‌ టెస్టులో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఈ అవలక్షణం వదలుకోవాలి. ముఖ్యంగా వికెట్లకు దూరంగా వెళ్తోన్న బంతులను గౌరవంగా వదిలేయటంపై విరాట్‌ కోహ్లి నెట్స్‌లో సాధన చేయాలి. యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌లు ఆచితూచి ఆడితే తొలి ఇన్నింగ్స్‌లోనూ భారత్‌ మెరుగైన స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది. కెఎల్‌ రాహుల్‌ ఒక్కడే టాప్‌ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆసీస్‌ పేసర్లు బుల్లెట్ల వంటి బంతులు సంధించినా తెలివిగా వదిలేస్తూ.. బాడీలైన్‌ బ్యాటింగ్‌తో అలవోకగా పరుగులు పిండుకుంటున్నాడు. ఇదే వ్యూహం కోహ్లి, గిల్‌, యశస్వి అలవాటు చేసుకుంటే భారత్‌కు మెల్‌బోర్న్‌లో ఎదురుండదు.
పిచ్‌పై పచ్చిక!
భారత్‌, ఆస్ట్రేలియా నాల్గో టెస్టు 26 నుంచి ఆరంభం కానుంది. పెర్త్‌, ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌లో పచ్చిక పిచ్‌లతో ఆస్ట్రేలియా స్వాగతం పలికింది. మెల్‌బోర్న్‌లోనూ అదే కథ పునరావృతం కాబోతుంది. మెల్‌బోర్న్‌ పిచ్‌పై ప్రస్తుతం పచ్చిక ఉంది. గతంలో మెల్‌బోర్న్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. కానీ భారత్‌ చివరగా ఇక్కడ 2020 మెల్‌బోర్న్‌ టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత పిచ్‌ స్వభావంలో భారీ మార్పులు వచ్చాయి. బ్యాటింగ్‌ పిచ్‌ కాస్త బౌలింగ్‌ స్వర్గధామంగా రూపాంతరం చెందింది. మ్యాచ్‌ ఆరంభానికి మరింత సమయం ఉండటంతో పిచ్‌పై పచ్చిక కాస్త తొలగించవచ్చు. అయినా, తొలి రోజు ఉదయం సెషన్లో పేసర్లను ఎదుర్కొవటం కష్టసాధ్యంగా మారనుంది.