– అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ పాలనలో పదేండ్లపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామన్న కేసీఆర్ ఇప్పుడు వీల్‌చైర్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నల్లగొండలోని ప్రాజెక్టులపై పెట్టలేదన్నారు. శనివారం అసెంబ్లీలో ‘తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల రంగం-శ్వేతపత్రం’అనే అంశంపై లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, నక్కలగండి టన్నెల్ పనులను పూర్తి చేయలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంట్రాక్టర్ల కోసం కట్టారనీ, రైతుల కోసం కాదన్నారు. కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని దోపిడీ చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, నల్లగొండలో యాదాద్రి విద్యుత్ ప్లాంటును నిర్మించొద్దంటూ 2018లోనే గత ప్రభుత్వానికి చెప్పినా వినలేదని అన్నారు. రూ.300 కోట్లతో మూసీనది పూర్తయ్యేదనీ, ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బెల్టుషాపుల ద్వారా తాగుబోతుల తెలంగాణ కాదనీ, బంగారు తెలంగాణను చేసి చూపిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాబోదని స్పష్టం చేశారు.
డిండి ఎత్తిపోతలను పూర్తి చేయాలి : బాలునాయక్
డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ సభ్యుడు బాలునాయక్ అన్నారు. దేవరకొండ, మునుగోడు, అచ్చంపేట ప్రాంతాలను కరువు నుంచి బయటపడేయాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, నక్కలగండి టన్నెల్ పనులను కాంగ్రెస్ ప్రారంభించినందునే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలనే పూర్తి చేయలేదన్నారు.