– ప్రమాదంలో రెండు లక్షల మంది యువత భవిష్యత్తు
– రాష్ట్రపతి ముర్ముకు మల్లికార్జున్ ఖర్గే లేఖ
– ప్రభుత్వం సైన్యాన్ని బలహీనపరిచింది
– అగ్నిపథ్‌ను రద్దు చేస్తాం
– పాత రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను తిరిగి ప్రవేశపెడతాం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం సైన్యంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌పై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. అగ్నిపథ్ పథకం కారణంగా సాయుధ దళాలలో యువతకు అన్యాయం జరుగుతోందని, వారి ఉపాధి పోతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రెండు లక్షల మంది యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ”బీజేపీ సర్కార్ సాయుధ దళాల్లో నియామకాల్ని మరింత కఠినతరం చేసింది. దీనికితోడు తాత్కాలికంగా రిక్రూట్‌మెంట్ చేసుకోవడం యువత భవిష్యత్తును అంధకారంలో పడేయటమే. యువత తమ కల సాకారం అవుతుందని ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోడీ తీసుకొచ్చిన అగ్నిపథ్‌తో యువతలో నిరాశ పెరిగిపోయింది. ఎంతో మంది యువత ఆత్మహత్య చేసుకున్నారు. వారికి న్యాయం జరగాలి. సాయుధ దళాల్లో ఎంపికైన వారిని ఈ మధ్య కలిశాను. ప్రభుత్వ చర్యతో దేశ సేవ చేసేందుకు వారు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. 2019-22 మధ్యకాలంలో దాదాపు రెండు లక్షల మంది త్రివిధ దళాల్లో చేరారు. ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి వారు కొలువులు సంపాదించారు. జాయినింగ్ లెటర్‌ల కోసం ఎదురు చూశారు. వారి ఆశలను సమాధి చేస్తూ ప్రభుత్వం అగ్నిపథ్ పథకంతో నియామకాలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ పథకం తనకు ఆశ్చర్యానికి గురి చేసిందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఒక పుస్తకంలో రాశారు. ఈ పథకం వివక్షతో కూడినది. దీని కింద నియమితులైన వారికి నాలుగేండ్లే ఉద్యోగం కల్పించి.. తరువాత ఉద్యోగం నుంచి తీసేస్తే.. దేశ వ్యాప్తంగా నిరుద్యోగిత రేటు పెరిగిపోతుంది” అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.
అగ్నిపథ్‌ను రద్దు చేసి, పాత రిక్రూట్‌మెంట్ స్కీమ్ తెస్తాం: సచిన్ పైలట్
అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని, పాత సాయుధ సేవల రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్ హామీ ఇచ్చారు. సైన్యంలో నాలుగేండ్ల సర్వీస్ అనంతరం రిటైరైన తరువాత ఉద్యోగుల భవితవ్యం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాడిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ దీపేందర్ హుడాతో కలిసి ఆయన మాట్లాడారు. ”అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా 17.5 ఏండ్ల నుంచి 21 ఏండ్ల వయస్సు వారిని నాలుగేండ్లు సైన్యంలో సేవలందిం చేందుకు సర్వీసులోకి తీసుకువెళతారు.
అయితే నాలుగేళ్ల సర్వీస్ అనంతరం వారిలో 25 శాతం మంది 15 ఏండ్ల పాటు సర్వీస్‌లో కొనసాగనిస్తారు. ఇక నాలుగేండ్ల అనంతరం రిటైరయ్యే యువ ఉద్యోగుల భవిష్యత్‌కు ఎలాంటి హామీ లేదని వారికి ఆ వయస్సులో పెన్షన్ రాదు. గ్రాట్యుటీ రూ.11 లక్షలను వారి వేతనం నుంచి తగ్గిస్తారు” అని సచిన్ పైలట్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యయ నియంత్రణ చర్యల పేరుతో సాయుధ దళాల నియామక ప్రక్రియతో చెలగాటమాడుతున్నారని దుయ్య బట్టారు. ప్రపంచంలోనే మన సైన్యం, రక్షణ బలగాల పాటవం, స్వయం కృషి మరుపురానివని సచిన్ పైలట్ పేర్కొన్నారు.
”మన రక్షణ వ్యయం పెరుగుతోంది… రక్షణ ఎగుమతుల ద్వారా చాలా డబ్బు సంపాది స్తున్నామని.. మనం స్వతంత్రంగా మారి స్వదేశీ తయారీ చేస్తున్నామని ఇటీవల చెప్పారు. మన రక్షణ శాఖ ఇంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లయితే, మనం అంత సామర్థ్యం సాధిస్తున్నట్లయితే, మన వీర సైనికుల ఉద్యోగాలు, నియామకాలు, కుటుంబాలకు వనరులను అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యమైనది” అని అన్నారు. అగ్నిపథ్ పథకాన్ని కేవలం ”రాజకీయీకరించిన” ఖర్చు తగ్గించే చర్యగా విమర్శించారు. ప్రభుత్వం సైన్యాన్ని బలహీన పరిచిందని ఆరోపించారు.
జి-20 సమ్మిట్‌కు రూ.4,100 కోట్లు, ప్రధానమంత్రి విమానానికి రూ.4,800 కోట్లు, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై రూ.20,000 కోట్లు, ప్రకటనల కోసం రూ.6,500 కోట్లు ఖర్చు చేసిన మోడీ ప్రభుత్వం, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో గందరగోళం సృష్టిస్తుందా? అని పైలట్ ప్రశ్నించారు. డబ్బు ఆదా చేయడం దేశ భద్రత, సమగ్రతకు సవాలుగా మారుతుందని అన్నారు.
అగ్నిపథ్ పథకాన్ని తీసుకురావాలని సైన్యం, దాని నాయకత్వం, యువత లేదా ఏ రాజకీయ పార్టీ నుండి ఎలాంటి డిమాండ్ లేదని దీపేందర్ హుడా అన్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లు ఏడాదికి సగటున 60,000-65,000 కు, 45,000కు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్లకు గతేడాదిలో క్షీణించాయని హుడా తెలిపారు. ”రిక్రూట్‌మెంట్ సంఖ్యలు ఈ స్థాయిలో తగ్గుతూ ఉంటే, 1.4 మిలియన్ల మా సైన్యం పదేండ్లలో 8,00,000కి తగ్గుతుంది” అని ఆయన అన్నారు.
”ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్” అనే ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చడానికి బదులుగా, ప్రభుత్వం ”నో ర్యాంక్, నో పెన్షన్” విధానాన్ని అమలు చేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకుడు కైలాష్ విజయ వర్గీయ అగ్నివీరులకు వారి కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం పై ఆయన మండిపడ్డారు. ఒక్కసారి యువత సరిహద్దులకు వెళ్లి తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుకుంటారని అన్నారు. అలాంటి వారు కూలీలుగా మారుతారని విమర్శించారు.