‘లోపలి వాన’ ఒక అనుభూతి కవిత

anologyతెలుగు సాహిత్యం తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం నిశ్చలంగా ప్రవహిస్తున్నది. విప్లవాల కాక కొంత తగ్గిపోయింది. ఆవేశం స్థానంలో ఆలోచన ప్రవేశించింది. అస్తిత్వ వాదాలు తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఇటీవల తెలంగాణ వాదం, లేక అస్తిత్వాన్ని గురించిన ఆలోచన మళ్లీ సాహిత్య రంగంలో పొటమరించడం గమనించవచ్చు. ఈ వాతావరణంలో అత్యంత ఆరోగ్యకరమైన కొన్ని యువకలాల్లో ఒకటిగా వికసించినది కుడికాల వంశీధర్‌ ‘లోపలి వాన’ కవితా సంపుటి. తెరచీ తెరవగానే ఇది ‘గొడుగు అక్కర్లేని వాన తడిసిపోదాం’, ‘గొడవ అక్కర్లేని వాన చదువుకుందాం’ అనే వాక్యాలు కనిపిస్తాయి. తడి గల ప్రతి హదయానికి అంకితం అని తన తడి చాటుకున్నాడు కవి. లోపలి పేజీలకు వెళితే ఇది నిజంగానే గొడుగు అక్కర్లేని వాన అని తెలుస్తుంది. ఇందులో తడవడం ఒక ఆహ్లాదకరమైన అనుభూతి. ఈ కవి సాధారణమైన మాటలతోనే కవిత మొదలెట్టి మెల్లిమెల్లిగా తన ఆవరణ లోపలికి మనల్ని తీసికెళ్తాడు. సముద్రం ఒక మహాకావ్యం అంటాడు. తొలి పొద్దులో ఆ నీటి పైన కిరణాలు మిఠాయిపై ఉన్న వెండి పొరలాగా మెరుస్తుంటాయి. మధ్యాహ్నం ఆ నీళ్లు పరుగెడుతున్న సూర్యుని చెమట చుక్కలతో తక్కుమంటాయి. నా కళ్ళకి ఎపవిడు అలల కాగితాలు కుప్పబోసినట్లుగా ఉంటుంది. తొలి పొద్దులో నీటి కిరణాలపై మెరయడం, కవిత్వలోకంలో ఒక సాధారణ అంశం. ఈ దష్టి చాలామంది కవులకు ఉంటుంది. కానీ కిరణాలు మిఠాయి పైనున్న వెండి పొరలు లాగా మెరుస్తాయని చెప్పడమే కవి లోకజ్ఞత. భావుకతను నిత్య జీవన సంబంధమైన లోకజ్ఞతతో అనుసంధించడం ఈ కవి సాధిస్తున్న ప్రత్యేకత. సూర్యుడిలో చెమట చుక్కలు చూడడం, వానితో కలిసి నీరు తళుక్కున మెరయడం కవి Aesthetic sensibility చెప్పకనే చెప్తుంది. కుడికాల వంశీధర్‌లో ప్రధానంగా మనకు కనిపించేది అనుభూతి వాదం. అనుభూతిని వాదం అనవచ్చునో కాదో తెలియదు కానీ (అనేవాళ్ళు అంటూనే ఉన్నారు) అనుభూతి సాంద్రమైన కవితా వాక్యాలు ఆయనకు అప్రయత్నంగా సొంతమవుతాయి. కవి రాత్రి బాల్కనీలో నిలుచున్నాడు. వాడి మొనతో గగనాన్ని తీర్చలేని నులి వెచ్చని దైన్యం ఆ గమనంలో రేఖామాత్రంగా చిత్రిస్తోందట. పులక రాలిపోయాక కూడా కవి చూపు ఆకాశం చూరుని గీరుతూనే ఉందట. ఈ పాదాల్లో ఒక మూర్త భావచిత్రం, దాని స్మతి పొరల వెనుక ఉన్న ఏదో అవ్యక్తమైన అనుభూతితో మనల్ని చుట్టుకుంటుంది. ఎడ్గర్‌ ఎలన్‌ పో ఈరాత్రి అనుభూతితో చేసే పలవరింత యాదికి వస్తుంది. ”Deep into that darkness peering long I stood there, wondering fearing doubting dreaming dreams no mortal ever  dared to dream before”. కవికి కత్యాద్యవస్థ ఎలా ఉంటుందో కుడికాలకు బాగా తెలుసు. ఈ అవస్థనే ‘ప్రాణావసాన వేళా జనితం’ అని వర్ణిస్తాడు శ్రీశ్రీ. ఈ కవి కూడా పద్యం రాసేముందు పొందే అవస్థను చక్కగా చిత్రించాడు ‘అలజడిలో మనసు’ అనే కవితలో. కవిత్వం చూస్తే వ్యక్తిగతం అనిపిస్తుంది కానీ అదో సార్వజనీనక భావన. కాలం విచిత్రమైనది. ఒక్కోసారి భయంకరమైనది కూడా. మనిషి తన జీవన వ్యాపారం కోసం కాలాన్ని సమయాలుగా విభజించాడు. అనంతమైన కవిత్వాన్ని అక్షరంగా కుదించినట్టు కుడికాల కూడా అగణితం అనే కవితలో ఆశ్చర్యం ప్రకటిస్తాడు, ”కొనసాగడమే తెలిసిన కాలాన్ని పెండ్యులం అడుగులతో కొలవడం వింత కదా” అంటాడు.
ఎంత కాదనుకున్నా అత్యాధునిక కాలంలో పుస్తక ప్రాధాన్యం తగ్గిపోతుంది. దీనికనేక కారణాలు ఉన్నాయి కానీ, పుస్తక ప్రేమికులైన కవులు మాత్రం పుస్తకాన్ని చదవడంలో ఉన్న ఆనందాన్ని పుస్తక ప్రాధాన్యాన్ని పదేపదే గుర్తుకు తెచ్చుకుంటున్నరు. చదవాలి అనుకోవడం వరకే మనం చేయగలిగేది. చదవడం మొదలెట్టాక ఒకసారి చెక్కిలి గిలి పెట్టొచ్చు. ఇంకొకసారి కన్నుల్లో జిగురు చీరలు ఎగర వేయవచ్చు, మరొకసారి మన కన్నీటి నిధుల్ని దోచేసుకోనూ వచ్చు. ఇట్లా పుస్తకం వల్ల కలిగగే రసానుభూతి మనల్ని ఎలాగైనా కదలించవచ్చు.
”ªBooks and doors are the same thing. You open them and you go through into another world”. పుస్తకాలు దర్వాజా లాగానే మనల్ని మరో ప్రపంచం లోపలికి తీసుకెళతాయని చెప్పిన winterson గుర్తుకు వస్తాడు ఈ పద్యం చదివితే.
అలతి అలతి మాటలలో అనంతాన్ని పొదగడం నిజమైన కవిత్వ లక్షణం. స్త్రీ గురించి, స్త్రీవాదం గురించి వివిధ రకాలైన అభిప్రాయాలు ఉన్నా, స్త్రీ అనంతమైన దుఃఖ అనుభూతి ‘మౌలిక’ అనే కవితలో రెండు వాక్యాల్లో చెబుతాడు. ”అవనిపై ఉన్న మూడు వంతుల నీరు ఆమె కనుదోయి నుంచే వచ్చిందేమో”. తరతరాలుగా సమాజం స్త్రీకి ఇస్తున్న విలువ, ఆవేదన ఈ రెండు మాటల్లో కూర్చాడు.
”వెలుతురును వెతుక్కుంటూ వెళుతున్న నాకు వెనుక నుండి ఒక వింత శబ్దం వినబడింది. తట్టుకున్న ఆగి చూశా, గాలికి రాపాడుతున్న పండుటాకులు కనిపించాయి” అంటూ మొదలైన ఈ కవిత మార్మికత నుంచి మెల్లిమెల్లిగా వాస్తవికతలోకి అడుగుపెడుతుంది. చివరికి ”ఓ మనిషీ నీ వంచనకు నేను తెల్లబోయాను అని మళ్ళీ నా నీడ నవ్వింది” ఇలాగా ఒక ప్రత్యేక పంథాతో కొనసాగే కవితలు ఈ పుస్తకం అంతా నిండుకున్నాయి
పర్వతాలు, సముద్రాలు అనే కవిత పర్వతాల గురించి సముద్రాల గురించి చెప్పినట్టే ఉంటుంది. ”ద్రవీభవించిన పర్వతాల నిశ్శబ్ద సారం సముద్రాలు, ఘనీభవించిన సముద్రాల శబ్ద విస్తారం పర్వతాలు”. ఈ రెండు మాటల్లో ప్రకతిలో, అలాగే మానవునిలో కూడా ఉండే విరుద్ధ శక్తుల పరస్పర ఆకర్షణ అవిభాజ్యమైన అంత: సంబంధం మనకు కనిపిస్తుంది.
ఈ కవి ‘కర్ఫ్యూ’ అనే కవితలో anology ఎంత బాగా వాడుకున్నాడో చూడవచ్చు. సాధారణమైన అలంకారాలకు భిన్నమైంది anology. సాధారణంగా anologyలో ఉపమాలంకారం లాగా రెండు విషయాలకు సామ్యత చెప్పబడుతుంది. ఇంతవరకు ఆగిపోకుండా ఈ సామెత నుండి మౌలిక విషయానికి కూడా సామ్యత ఉండి, మౌలిక విషయాన్ని మరింత ఉద్దీపనం చేయడం లక్ష్యంగా ఉంటుంది. ఆయన కవితలో ”నిన్నటి పాదముద్రలు చెరిగిపోయాయి, రాకాసి అలల రాకపోకలతో తీరమంతా కర్ఫ్యూ”. ఇందులో రాకాసి అలలు రావడం వల్ల తీరమంతా కర్ఫ్యూ అని దానివల్ల పాదముద్రలు చెదిరిపోయాయని చెబుతూ, అలాగే కర్ఫ్యూ సందర్భంగా ప్రభుత్వం లేక పోలీసులు రావడం, జనాలు లేక బాధితులు చెదిరిపోవడం అనే మౌలికాంశంతో పోలికను రాబట్టాడు. ”అహానికి అంతులేని దాహం పట్టు విడుపులు లేకుండా పయనిస్తే మది గదిలో కర్ఫ్యూ” ఈ పాదంలో కూడా అహానికి మదిగదిలో జరిగే పరిణామానికి మౌలికమైన కర్ఫ్యూతో పోలిక తేవడం గమనించవచ్చు. ఈ విధంగా అన్ని పాదాలలో ఇది సాధించి చూపించాడు కుడికాల ఈ కవితలో.
కుడికాలలో అక్కడక్కడా రూపంతో రాజీ పడడం కూడా ఉంటుంది. ఒక జ్ఞాపకం, ఒక వ్యాపకం- సవ్వడి, రువ్వడి లాంటి అంత్యప్రాసలు సీరియస్‌ నెస్‌ని తగ్గిస్తాయి. ఆక్రోశ్‌ లాంటి హలంత ప్రయోగాలు ప్రత్యెక ప్రయోజనం లేకుండా చేయడం పెద్ద అవసరం ఏం కాదు.
ఇట్లాంటి సవరించుకోదగిన చిన్న లోపాలు మినహాయిస్తే ఆధునిక కవితా రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకునే శక్తి వంశీధర్‌కు పుష్కలంగా ఉంది.
డా|| కాంచనపల్లి గోవర్ధన్‌ రాజు, 9676096614