అమాయక ప్రజలు చనిపోవడం ఆగాలి

Innocent people must stop dying– పుతిన్‌ కోరుకుంటున్నది ఇదే : ట్రంప్‌
వాషింగ్టన్‌ : యుద్ధం కారణంగా అమాయక ప్రజలు చనిపోవడం ఆగాలని పుతిన్‌ కోరుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. తాను ఇటీవల రష్యా అధ్యక్షుడితో సంభాషించిన ఫోన్‌కాల్‌ వివరాలను ట్రంప్‌ తాజాగా వెల్లడించారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో న్యూయార్క్‌ పోస్టు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివరాలు వెల్లడించారు. ”ప్రజలు చనిపోవడం ఆపాలని ఆయన అనుకొంటున్నారు. మరణించిన వారంతా యువత, మంచివాళ్లు. వారు మీ పిల్లల్లాంటి వారే. అకారణంగా లక్షల మంది చనిపోయారు” అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అలాగే, ఒక వేళ తాను 2022 సమయంలోనే అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఈ యుద్ధం ఎప్పటికీ జరిగేది కాదన్నారు. అలాగే, తనకు రష్యా అధినేతతో ఉన్న బలమైన సంబంధాన్ని ఆయన గుర్తు చేశారు. ”నాకు పుతిన్‌తో సత్సంబంధాలున్నాయి. దేశానికే బైడెన్‌ ఓ అవమానం” అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా, ఇరాన్‌ విషయాన్ని ట్రంప్‌ ప్రస్తావిస్తూ.. తాను సైనిక చర్యల కంటే చర్చలకే అధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. ఇరాన్‌తో నాన్‌ న్యూక్లియర్‌ ఒప్పందం చేసుకోవాలని అనుకొంటున్నట్లు వెల్లడించారు. బాంబు దాడుల కంటే దీనిని తాను ఇష్టపడతానని చెప్పారు.ప్రస్తుతం ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ తెలిపారు. ఉక్రెయిన్‌తో 500 మిలియన్‌ డాలర్ల డీల్‌ను ట్రంప్‌ ప్రతిపాదించారు. అయితే, కీవ్‌ ఆధీనంలో అరుదైన ఖనిజాలను దీని కింద అమెరికాకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోపాటు గ్యాస్‌ను కూడా సరఫరా చేయాల్సి వస్తుంది. ఈవారం మ్యూనిచ్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ట్రంప్‌ ప్రతిపాదనపై స్పష్టత రానుంది.
‘ప్రెసిడెంట్‌ మస్క్‌’.. టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ
ప్రపంచ బిలీయనర్‌ ఎలాన్‌ మస్క్‌ను అమెరికా అధ్యక్షుడిగా పేర్కొంటూ టైమ్‌ మ్యాగజైన్‌ ఓ కవర్‌ పేజీని ప్రచురించడం సంచలనంగా మారింది. ఓవల్‌ ఆఫీస్‌లోని అమెరికా అధ్యక్షుడి స్థానంలో మస్క్‌ కాఫీ కప్‌తో కూర్చొని ఉన్నట్లుంది. అలాగే, ”ఇన్‌సైడ్‌ ఎలాన్‌ మస్క్‌ వార్‌ ఆన్‌ వాషింగ్టన్‌” అనే పేరుతో కవర్‌ పేజీ కథనం రాసింది. ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రంప్‌ కోసం మస్క్‌ చేసిన కృషిని, ప్రస్తుత ట్రంప్‌ ప్రభుత్వానికి అందిస్తున్న సహకారాన్ని వివరించింది. దేశంలో ఉన్న మిలియన్ల మంది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు మస్క్‌ దయపై ఆధారపడి ఉందని టైమ్‌ తన కథనంలో తెలిపింది. మస్క్‌ ట్రంప్‌నకు తప్ప మరెవరికీ జవాబుదారీగా వ్యవహరించరని పేర్కొంది. తన అజెండాకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు ఉండేలా మస్క్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే యుఎస్‌ఎయిడ్‌ను మూసివేయించారని పత్రిక విమర్శించింది. కాగా, టైమ్‌ మ్యాగజైన్‌ మస్క్‌ను కవర్‌పేజీపై ప్రచురించడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపునకు కీలకపాత్ర పోషించారని చెబుతూ మస్క్‌ను ‘కింగ్‌ మేకర్‌’గా పేర్కొంది. ‘సిటిజన్‌ మస్క్‌: ఆయన చేయవలసిన జాబితాలో తరువాత ఏంటి?’ అనే టైటిల్‌తో కవర్‌ పేజీని ప్రచురించింది.
అయితే, ట్రంప్‌ కథనంపై ట్రంప్‌ వ్యంగ్యంగా స్పందించారు. ‘టైమ్‌ మ్యాగజైన్‌ ఇంకా నడుస్తోందా..? ఇప్పటి వరకు అది ఉన్న విషయమే నాకు తెలియదు’ అని వెటకారంగా అన్నారు. అలాగే, మస్క్‌ అమెరికాలో జన్మించలేదు కాబట్టి ఆయన ఎప్పటికీ దేశాధ్యక్షుడు కాలేరని ట్రంప్‌ స్పష్టం చేశారు. తన ఆదేశాలకు అనుగుణంగానే ఎలాన్‌ పని చేస్తున్నారని చెప్పారు.