నవోత్తేజం

innovationపాలకుల, వారి ‘యజమానుల’ ప్రాపకం కోసం ఏనాడూ వెంపర్లాడలేదు నవతెలంగాణ. కష్టజీవుల పోరాటాలకవసరమైన ‘గ్రాస’ మందించడం నవతెలంగాణ లక్ష్యం. తిరిగి ఆ పోరును పత్రిక సంపాదకీయాలు మొదలు, వ్యాసాలు, వార్తలు, విశ్లేషణల్లో ప్రతిఫలిస్తూంటుందీ పత్రిక. అందుకే ఇది కేవలం న్యూస్‌ పేపరే కాదు… కష్టజీవుల దృష్టికోణం నుండి చూసే ‘వ్యూస్‌ పేపర్‌’ కూడా.
నేటికి నవతెలంగాణకు నవ వసంతాలు నిండాయి. పాలకుల రంగులతో సంబంధం లేకుండా ప్రజా కోణమే పరమావధిగా, దశాబ్దాల ‘ప్రజాశక్తి’ వారసురాలిగా గోదాలోకి దిగింది ‘నవతెలంగాణ’. ప్రభుత్వాల తప్పొప్పులను నిర్మొహమాటంగా ఎత్తిచూపగల చేవ దానిది. అటువంటి అక్షర మాలిక ఆక్సిజన్‌ పైప్‌పై అధికారం ఇనుపబూట్లు నర్తించడం సహజమే. ఆ స్థితిలో జార్జిఫ్లాయిడ్‌లా ఊపిరొదిలేయలేదు. పెనుగులాడింది. నిటారుగా నిలబడటమేగాక ఒకింత నిలదొక్కుకోగలగడం ‘నవతెలంగాణ’ అన్ని స్థాయిల్లోని సిబ్బంది నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం.
ఇది సోవియట్‌ విప్లవ కాలంలో లెనిన్‌ స్థాపించిన ‘ఇస్క్రా’ రోజులు కాకపోవచ్చు. జారు చక్రవర్తి పోలీసు జాగిలాలు వేటాడే దశ కాకపోనూవచ్చు. కాని ‘పెట్టుబడి’ సహస్రపాదిగా నడుస్తున్న కాలం. అందునా, మోడీ సామ్రాజ్యంలో పెన్నులకు సంకెళ్ళు పడుతున్న కాలం. నయానో, భయానో పత్రికలను లొంగదీసుకుంటున్న కాలం. మోడీ ప్రభుత్వ విధానాలనేగాక, వాటికి కారణభూతమైన సరళీకృత ఆర్థిక విధానాల ఆనుపానులను ఆమూలాగ్రంగా విశ్లేషించి పాఠకలోకానికి చేరవేసేందుకు శతధా ప్రయత్నిస్తున్నది నవతెలంగాణ.
మనుషుల్ని మనుషులుగా కాక మార్కెట్‌గా పరిగణిస్తుంది పెట్టుబడి. మనుషుల్ని వారి మతాలుగా, కులాలుగా విడగొట్టి చూస్తుంది మతోన్మాదం. ఈ కార్పొరేట్‌ – మతోన్మాద శక్తులు మన దేశంలో పెనవేసుకున్నంత స్పష్టంగా మరెక్కడా చూడం నేడు. ఈ దుస్థితిని పాఠకులకు విడమరిచి చెప్పడం నవతెలంగాణ దినచర్యల్లో ఒకటి.
పాలకుల, వారి ‘యజమానుల’ ప్రాపకం కోసం ఏనాడూ వెంపర్లాడలేదు నవతెలంగాణ. కష్టజీవుల పోరాటాలకవసరమైన ‘గ్రాస’మందించడం నవతెలంగాణ లక్ష్యం. తిరిగి ఆ పోరును పత్రిక సంపాదకీయాలు మొదలు, వ్యాసాలు, వార్తలు, విశ్లేషణల్లో ప్రతిఫలిస్తూంటుందీ పత్రిక. అందుకే ఇది కేవలం న్యూస్‌ పేపరే కాదు… కష్టజీవుల దృష్టికోణం నుండి చూసే ‘వ్యూస్‌ పేపర్‌’ కూడా.
ఆ కష్టజీవుల్లో అంతర్భాగమైన దళితులు, గిరిపుత్రులపై నిత్యం సాగే కులదురహంకార దాడులు, కార్పొరేట్‌ దౌర్జన్యాలను కేవలం ఎండగట్టడంతో ఆగిపోదు. దానికి మూలకారణమైన అగ్రకుల ఆధిపత్య సంస్కృతిని, భూస్వామ్య భావజాల మూలాలను శక్తిమేరకు పాఠకుల్లో బహిర్గతమొనరుస్తుంది. అందుకు ఎడిట్‌ పేజీ ప్రధాన సాధనం. నవకవుల ప్రస్థానానికి బహుశా నవతెలంగాణ ‘దర్వాజా’ అంతిమ మజిలీ అనడం అతిశయోక్తి కాదేమో!
సిబ్బంది నిబద్ధత, వారి త్యాగాల ముందు ‘మహమ్మారి’ తలదించుకు వెళ్ళిపోయింది. అయినా ప్రస్తుత మీడియా రంగంలోని పోటీలో నవతెలంగాణ వంటి పత్రికలు నిలదొక్కుకోగలగడం ఎంత కష్టమో పాఠకలోకానికి తెలియందికాదు. మా బలహీనతలు, లోటుపాట్లు మా దృష్టిలో ఉన్నాయని చెప్పుకోవడం నమ్రత కోసమే కాదు, అది మా బాధ్యత కూడా.
ఈ వార్షికోత్సవ సందర్భాన పెద్ద ఎత్తున చందాదారులుగా చేరడం, చేర్పించడం ద్వారా నవ నవోన్మేషంగా నవతెలంగాణ మీ చేతులకందించడంలో మీరు సహకరిస్తారని ఆశిస్తూ…