‌సీఆర్పీల వినూత్న నిరసన

– సమస్యలు పరిష్కరించాలని కేసీఆర్ కు పోస్ట్ కార్డులు
నవతెలంగాణ- పెద్దవంగర: తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిశు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండలానికి చెందిన సీఆర్పీలు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్ట్ కార్డులు పంపారు. ఈ సందర్భంగా సీఆర్పీలు సంతోష్, నిరంజన్, రంగన్న, రమాదేవి మాట్లాడుతూ..గత 18 సంవత్సరాలుగా తాము చాలీచాలని వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో తాము ఎంతో కీలకంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో సమగ్ర శిశు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని, మన రాష్ట్రంలో కూడా గతంలో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కాలయాపన చేయడం తగదన్నారు. మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం అందించాలని, 5 లక్షల ఆరోగ్య భీమా వర్తింపజేయలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేనియెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.