– 9వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష
– ఉధృతమైన నేతన్నల ఆందోళన
నవతెలంగాణ – గంగాధర
మండలం గర్శకుర్తి గ్రామంలో శుక్రవారం నేతకార్మికులు కళ్లకు నల్లగుడ్డతో గంతలు కట్టుకుని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పవర్ లూమ్స్ పరిశ్రమకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ నేతకార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 9 వ రోజుకు చేరింది. రోజుకో విధంగా నిరసన కార్యక్రమం చేపడుతూ గ్రామంలోని నేతకార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు. నిరాహార దీక్షలో భాగంగా ఓ రోజు కురిక్యాల ప్రధాన రహదారిపై బైటాయించి పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. నిరసనలతో హోరెత్తిస్తున్న నేతకార్మికుల మరో రోజు వంటావార్పు చేపట్టి రోడ్డుపై బైటాయించి సహఫంక్తి భోజనాలు చేశారు. గ్రామంలోని ప్రతి కార్మికుడు ఈ నిరసనల్లో పాల్గొంటుండగా, వినూత్న కార్యక్రమాలతో దీక్షను కొనసాగిస్తున్నారు. వస్త్ర ఉత్పత్తులు నిలిచి పవర్ లూమ్స్ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న తాము, తమ కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డామని నేతకార్మికులు ఆవేదన చెందారు. గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రత్యామ్యాయంగా గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు కల్పించక బతుకుదెరువు భారంగా మారిందని వాపోయారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గ్రామంలో పనులు లేక పస్తులుండగా, ఆకలిచావులు, ఆత్మహత్యలకు పాల్పడిన రోజులను గుర్తు చేసుకుంటూ నేతకార్మికులు భయాందోళన వ్యక్తం చేశారు. పవర్ లూమ్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతుండగా ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ, వస్త్రోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ, ఉపాధ్యక్షుడు చిందం సత్యనారాయణ, కార్మిక సంఘం నాయకులు తిరుపతి, వేముల వేణు, సిరిమల్ల అశోక్, దూస మధు, అంబటి రమేష్, అలువాల రమేష్, బుదారపు మల్లేశం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.