గిరిజనుల అభివృద్ధికి వినూత్న పథకాలు

– ట్రైకార్‌ చైర్మెన్‌ బెల్లయ్య నాయక్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ట్రైకార్‌ ద్వారా గిరిజనుల అభివృద్ధికి వివిధ రకాలుగా వినూత్నంగా పథకాలను చేపట్టనున్నట్టు తెలంగాణ షెడ్యూల్‌ తెగల ఆర్థిక సహకార సంస్థ(ట్రైకార్‌) చైర్మెన్‌ తేజావత్‌ బెల్లయ్యనాయక్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ట్రైకార్‌ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన తొమ్మిదవ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బెల్లయ్య నాయక్‌ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.369కోట్లతో ట్రైకార్‌ వార్షిక ప్రణాళిక ఆమోదించినట్టు తెలిపారు. దీంతో 28,350 మంది గిరిజన లబ్దిదారులకు వివిధ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సహకారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి సీఎంఎస్‌టీఈఐ, ఇందిర గిరిజల వికాసం, నైపుణ్య అభివృద్ధి శిక్షణలు, ఇతర పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌ డాక్టర్‌ ఎ శరత్‌, ట్రైకార్‌ జీఎం కె శంకర్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు.