ఆరోగ్య సేవలపై కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆరా..

నవతెలంగాణ-గంగాధర : గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామాన్ని సందర్శించిన  కేంద్ర ప్రభుత్వ గ్రూప్-ఏకు సంబందించిన వివిధ శాఖల  అధికారులు గ్రామస్తులు, వైద్య సిబ్బందితో సమావేశమై వైద్య సేవలపై ఆరా తీశారు. ఐదు రోజుల శిక్షణలో గ్రామానికి చేరిన అధికారులు గ్రామంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి గ్రామస్తులకు అందిస్తున్న వైద్య సేవలను పల్లె వైద్యున్ని అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో విలేజ్ సోషల్ మ్యాప్ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో పని చేస్తున్న వివిధ శాఖల పని తీరును  తెలుసుకున్నారు. గ్రామంలో అన్ని శాఖ ల పని తీరు పూర్తి సంతృప్తికరంగా ఉందని అధికారులకు గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా గర్షకుర్తి రైతు వేదికలో రైతులతో సమావేశమైన అధికారులు పంటల గురించి, గిట్టు బాటు ధర, పంట నష్టం, రైతు బీమా, రైతు రుణ మాఫీ వంటి పలు అంశాలను రైతుల ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ కాసారపు శైలజా-శ్రీకాంత్, ఎంపిడిఓ రాజీవ్ మల్హోత్రా, పంచాయతీ కార్యదర్శి సార్ల శ్రీనివాస్,  కంప్యూటర్ ఆపరేటర్ గంగాధర రమేష్, ఏఈఓ  అన్నంతరాజ్, రైతులు, వార్డు సభ్యులు, ఐకేపి మహిళా సంఘాలు, అంగన్ వాడి టీచర్లు, హెల్త్ సిబ్బంది గ్రామస్థులు పాల్గొన్నారు.