– సుప్రీంకోర్టు ఆశ్రయించిన బీఆర్‌ఎస్ నేత హరీశ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బంజారా హిల్స్‌లో ఆనంద్ సినీ సర్వీస్‌కు భూ కేటాయింపులపై హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. 2008లో ఆనాటి ఉమ్మడి ఏపీ సర్కార్ ఆనంద్‌సినీ సర్వీస్‌కు ఎకరా రూ.8,500 చొప్పున ఐదు ఎకరాలు భూమిని కేటాయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ హరీశ్‌రావు, తదితరులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ హరీశ్ రావు సుప్రీంకోర్టును పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజరు కుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది.
ఈ పిటిషన్ విచారణలో భాగస్వామ్యం కావడానికి జస్టిస్ సంజరు కుమార్ నిరాకరించారు. దీంతో జస్టిస్ సంజరు కుమార్ లేని ధర్మాసనానికి బదిలీ చేయాలని సీజేఐ దష్టికి తీసుకెళ్లాలని జస్టిస్ సంజీవ్‌ఖన్నా రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ నవంబరు 4తో మొదలయ్యే వారానికి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు.