ఇన్సానియత్‌ కో జగావో… ఉర్దూ ఫెస్ట్‌ 2023

ఇద్దరు మనుషులు కలుసుకున్నప్పుడు ఏం… మాట్లాడుకుంటారు…?! సంసార బాధలు, సుఖాలు, సమాజ పోకడలు…. ఎన్నో… అలాగే ఇద్దరు కవులు కలుసుకున్నప్పుడు కూడా అంతే…. ముచ్చట్లు…. అవే ముచ్చట్లు… కుదిరితే రెండు కవితలు… ఏ భాష కవులు అయినా అలాగే… యాదచ్ఛికంగా కలుసుకుంటే ఆ షార్ట్‌ టైంలోనే ప్రపంచాన్ని చుట్టేసినంత సంబరపడతారు. అలాంటిది అందరూ అనుకుని ఒకచోట చేరితే.., ఇంకేమీ.. ముచ్చట్లకు
అవధులు ఉండవు. అలాంటి ప్రయత్నమే తెలంగాణ సాహితి ఉర్దూ ఫెస్ట్‌- 2023. ఆగస్టు 25న మఖ్దూం వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి యాభైకి పైగా షాయర్లు పాల్గొని మఖ్దూం యాదిలో ఈ ఫెస్ట్‌ని జరుపుకున్నారు. అరబిక్‌, సంస్కతం, ఫార్సీ, హిందీ, మరికొన్ని భారతీయ  భాషలతో కలుపుకొని అంతర్జాతీయ భాషగా ఒక కమ్మని, ఓ తీయని భాషగా ఉర్దూ వెలిగొందిందని భాషావేత్తలు కొనియాడారు.
తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఫెస్ట్‌ ప్రారంభ సభలో దక్కని ఉర్దూ గోల్కొండలోనే పుట్టి ప్రత్యేకమైన మాండలికంలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నది. తెలంగాణ ఉర్దూలో మొదటి కవితని రాసింది కులీఖుతుబ్‌షా. అతను గొప్ప ఉర్దూ భాషా పండితుడని ప్రముఖ కవి, భాషావేత్త అయిన ఏనుగు నరసింహారెడ్డి తెలియజేశారు.
ఉర్దూ అందరి భాష, భారతదేశంలో పుట్టిన భాష, మాండలికలు ఉన్నప్పటికీ దక్కని ఉర్దూ ప్రజల భాషగా నిలిచిందన్న అభిప్రాయం ఫెస్టు వ్యక్తపరిచింది. మఖ్దూం మొహియుద్దీన్‌ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ ఫెస్ట్‌ గంగా, జమున తహజీబ్‌ను సాహిత్యంలో కొనసాగిస్తుందని ప్రముఖ కవి యాకూబ్‌ కొనియాడారు. మఖ్దూం మొహియుద్దీన్‌ జీవితాన్ని, సాహిత్యాన్ని, ఆశయాలను, ఆదర్శాలను స్మరించుకుంటూ జమీలా నిషాత్‌, డాక్టర్‌ రవూఫ్‌ ఖైర్‌లు తమ సందేశాలు ఇచ్చారు. మఖ్దూం నాటకకర్తగా, నటుడిగా, ప్రజాకవిగా, నాటి నిజాం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మిక నాయకుడిగా, చిరస్థాయిని నిలుపుకున్నారు. ఉర్దూ సాహిత్యం నేడు ఆ దిశగా పయనించాలని వక్తలు పునరుద్ఘాటించారు. ప్రజల వైపు నుండి కలాన్ని నిలబెట్టడంలో, గళాన్ని విప్పడంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా మఖ్దూం వదులుకోలేదనేది వాస్తవం. అందుకే జైలు జీవితాన్ని అనుభవించాడు. దాశరథి, పీవీ నరసింహారావు, బూర్గుల రామకష్ణారావు, కాళోజి వంటి మహారథులు ఉర్దూ సాహిత్యంలో కషి చేశారు. ఇది సత్యం. తెలంగాణ సాహితి ప్రతి ఏటా జరుపుతున్న లిటరరీ ఫెస్టుల్లో భాగరగా నిర్వహించిన ఈ ఉర్దూ ఫెస్ట్‌ ఐదవది. ”అన్నదమ్ముల వలెను జాతులు మతములన్ని మెలగవలెను” నినాదంతో ఈ ఫెస్ట్‌ని మొదటిసారిగా నిర్వహించి ముందుకు తీసుకెళ్లాలని సంస్థ భావిస్తుందని, ఫెస్ట్‌ ఉద్దేశాలు, సంస్థ ప్రధాన కార్యదర్శి ఆనందాచారి, అధ్యక్షులు వల్లభాపురం జనార్ధన తెలియజేశారు.
”నఫ్రత్‌ కి ఆగ్‌ మే
ఇన్సానియత్‌ జల్‌ రహా హై
ఇన్సాన్‌ కో జగావో…
ఇన్సాన్‌ కో జగావో…”
కొన్ని వాహ్‌… వాహ్‌లు
మరికొన్ని కంటి తూడుపులు…
ప్యార్‌, దిల్‌, ఖుషి, గమ్‌, బహెక్‌ తే నదియాన్‌, చమక్‌ తే సీతారే… ఏక్‌ దూస్‌ రేక సహారా, భారు చారా, అమన్‌, చమన్‌, అంశాల పై షాయరీలు, గజల్లు అలరించాయి.
ప్రముఖ కవి, అనువాదకులు, ఫెస్ట్‌ కన్వీనర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌ సూచనలు, సలహాలు, మార్గదర్శిలో ఉర్దూ సాహిత్య సమ్మేళనం గొప్పగా సాగింది.
సయ్యద్‌ రియాజ్‌ తన్హ ఈ ఫెస్ట్‌కు హోస్ట్‌గా వ్యవహరించి, ముషాయిరాను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. డాక్టర్‌ మోత్కూరి నరహరి, ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్‌, తెలంగాణ సాహితి నాయకులు షేక్‌ సలీమా, వహీద్‌ ఖాన్‌, నస్రీన్‌ ఖాన్‌ , ఖాజమైనద్దీన్‌, తంగిరాల చక్రవర్తి, మోహన కష్ణ, మేగోటి రేఖా , ముజాహిద్‌లు నిర్వాహకులుగా వ్యవహరిం చారు. సయ్యద్‌ నవీద్‌, అబూ నబిల్‌ ఖాజా మసిఉద్ధ్దిన్‌, మిన్హాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, అత్యబ్‌ ఎజాజ్‌, నవీద్‌ జాఫరీ, బెలం నిజాది, అరిఫ్‌ మసూద్‌ సిద్ధికీ, తన్వీర్‌ రజాకీ, డా.నయీమ్‌ వంటి సీనియర్‌ షాయర్లు, అబ్బాస్‌, ఫర్హాన్‌, యువ షాయర్లతో పాటు ప్రముఖ షాయర్లు మూడు షెషన్లుగా ముషాయరాలో పాల్గొన్నారు. హిమ్మత్‌ అప్జాహిని శాలువాలతో మోసుకెళ్ళుతూ ఫెస్ట్‌ ముగిసింది.
– వహీద్‌ ఖాన్‌, 9441946909

ఇది అందరి భాష
ఉర్దూ సాహిత్యంలో అనేక ప్రక్రి యలు ఉన్నాయి. గజల్‌, రుబాయి, నజమ్‌, షాయరీ మొ||. నేను రుబా యిలు రాయడానికి ఉర్దూలో ఉన్న రుబాయి పక్రియ చాలా ఆకర్షించింది. మత్తు లొలికించే, మైమరిపించే తన్మయత్వం చెందించే షాయరీలు ఉర్దూలో చాలా వున్నాయి. సినారె గజల్‌ అద్భుతంగా రాయడానికి ఉర్దూ గజల్లే కారణం. ఉర్దూ కేవలం ముస్లింల భాష కాదు ఇది అందరి భాష.
– ఏనుగు నరసింహా రెడ్డి
(ప్రముఖ తెలుగు కవి, రచయిత, వ్యక్తిగత కార్యదర్శి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, తెలంగాణ)

వారి స్ఫూర్తితోనే…
మఖ్దూం మొహియుద్దీన్‌ మా కుటుంబానికి సన్నిహితులు. వారి ఇంతెఖాల్‌ అప్పుడు నాది చిన్న వయస్సు. మా ఇంట్లో అందరూ విచారంలో మునిగారు. నాన్న దగ్గరకు తరచూ వస్తూ వుండే వారు. షాయిరీలు, కార్మికుల సమస్యలు, చర్చిస్తుండేవారు. నాన్న, మఖ్దూం స్ఫూర్తి నన్ను ఒక సమాజ సేవకురాలిగా చేసింది. షాయిరీలు రాయడం, రాయించడం, తర్ఫీదు ఇవ్వడం, ఉర్దూ భాష పెంపొందుటకు కార్యక్రమాలు నిర్వహించడం వారి ద్వారానే నేర్చుకున్నాను.
– జమీలా నిషాత్‌, ప్రముఖ ఉర్దూ కవయిత్రి

మరింత విస్తృతంగా…
తెలుగు సాహిత్యం, తెలుగు భాష, కవులు, రచయి తలు, తెలుగు పాట, కాన్సెప్ట్‌లతో తెలంగాణ సాహితి తరఫున ఫెస్ట్‌లను నిర్వహించాం. తెలంగాణ, ఉర్దూ సాహిత్యానికి కూడా పేరుగాంచింది. మన దగ్గర అపార మైన ఉర్దూ సాహిత్యం ఉన్నది. హైద్రాబాద్‌ ఉర్దూ సాహి త్యానికి కేంద్రం. ఉర్దూ ఫెస్ట్‌ను నిర్వహిద్దామని తెలంగాణ సాహితి కమిటీ నిర్ణయం చేసింది. రాబోయేకాలంలో ఉర్దూఫెస్ట్‌ను విస్తతంగా నిర్వహిం చుకుందాం. తెలుగు, ఉర్దూ సాహిత్య పండుగలు జరగాలి.
– కె. ఆనందాచారి, తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి

వారి బాటలోనే…
ఉర్దూ యువ కవులంటే మఖ్దూంకి చాలా ఇష్టం. వారి షాయరీల్లో చైతన్యం కలిగించే పదాలను వెతికేవారు. సరి దిద్దేవారు. ప్రోత్సహించేవారు. నా షాయారీని విని భుజం తట్టి చెప్పారు. ”బహుత్‌ ఖూబ్‌ …” వారి బాటలోనే షాయారీ రాస్తున్నాను.
– డా. రవూఫ్‌ ఖైర్‌
పార్శి, ఉర్దూ భాష వేత్త

ఆచరణకు బలం వస్తుంది
నేను… తెలుగు చదువుతాను, రాస్తాను, తెలుగు కవులకు శిక్షణ ఇస్తాను. కాని ఉర్దూలో రాయలేదు. తెలుగు, ఉర్దూ కవుల సమ్మేళనం జర గాలి. ఇద్దరి ప్రక్రియల, పద బంధాల నిర్మాణం, సంస్కతుల అలాయి బలాయి అవుతుంది. దీనితో గంగ, జమున తహజీబ్‌ ఆచరణకు బలం వస్తుంది. ఇది సమాజ నిర్మాణానికి అవసరం.
– యాకూబ్‌, ప్రముఖ కవి రచయిత

నిధులు కేటాయించాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉర్దూకు ప్రాధాన్యం ఇస్తామ న్నారు. కాని రెండవ అధికార భాషగా కేవలం కార్యాలయాల బోర్డులపై మాత్రమే కనిపిస్తుంది. ఉర్దూ అకా డమీ ఏర్పాటు చేశారు కానీ నిధులు ఇవ్వడం లేదు. అకాడమీ పనులు ఎలా జరుగు తాయి. ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలు లేవు. దాని వల్ల విద్యార్థులకు ఉర్దూపై ఇష్టం ఉండటం లేదు. ఉర్దూ అందరి భాష. తగినన్ని నిధులను కేటాయించి ఉర్దూ ఘర్‌లను ఏర్పాటు చేస్తే కాని ఉర్దూ అభివద్ధి కాదు. ఉర్దూ నేర్చుకున్న వారికి ఉపాధి లభిస్తే ఉర్దూ సజీవంగా ఉంటుంది.
– అబ్బాస్‌, ఆవాజ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి