స్టాఫ్‌ నర్సు ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మొండి చెయ్యి

–  నాలుగు శాతం రిజర్వేషన్‌ అమలు ఎక్కడీ
– 2016 ఆర్‌పీడీ చట్టానికి భిన్నంగా ఉద్యోగ నియామకాలు
–  సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన వికలాంగ అభర్థులకు
–  వెంటనే నియామక పత్రాలివ్వాలి :ఎన్‌పీఆర్‌డీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన స్టాఫ్‌ నర్సుల ఉద్యోగ నియామకల్లో వికలాంగులకు మొండి చెయ్యి చూపిందనీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయినప్పటికీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వకుండా వికలాంగులను మోసం చేసిందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు బుధవారం ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్‌ వెంకటేష్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ అస్పత్రులు, గురుకుల విద్యాలయాలు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో 7,094 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో అనేక మంది వికలాంగులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ వారితో వాటిని భర్తీ చేయలేదని తెలిపారు. ప్రభుత్వం భర్తీ చేస్తున్న 7,094 పోస్టుల్లో నాలుగు శాతం అంటే 283 పోస్టులను వికలాంగులతో భర్తీ చేయాలి. కానీ 138 పోస్టులను శారీరక వికలాంగులు లేరనే కారణంతో భర్తీ చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. అనేక మంది సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత విడుదల చేసిన ఫైనల్‌ లిస్టులో పేర్లు వచ్చినప్పటికీ నియామక పత్రాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్‌ను స్టాఫ్‌ నర్సు ఉద్యోగ నియామకాల్లో అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. వికలాంగురాలికి ఉద్యోగమిస్తూ మొదటి సంతకం చేశామని గొప్పగా ప్రకటించిన సీఎం స్టాఫ్‌ నర్సు ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్‌ను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని కోరారు. అర్హత సాధించిన ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.