తిమ్మాపూర్‌ సర్కిల్‌ ఆఫీస్‌ తనిఖీ

తిమ్మాపూర్‌ సర్కిల్‌ ఆఫీస్‌ తనిఖీనవతెలంగాణ – తిమ్మాపూర్‌ :
కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సీపీ అభిషేక్‌ మొహంతి తనిఖీ చేసారు. కార్యాలయంలో గల పెండింగ్‌ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. విసిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టబడిన నూతన చట్టాల అమలు జరిగేలా చూడాలన్నారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా సర్కిల్‌ పరిధి పోలీస్‌ స్టేషన్‌లోని అధికారుల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్‌ వారెంట్ల అమలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. తిమ్మాపూర్‌ సర్కిల్‌ పరిధిలో ఎక్కువగా రాష్ట్ర రహదారి విస్తరించి ఉన్నందున తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌ హోల్స్‌గా గుర్తించి, అవసరమైతే ఇతరశాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలు నివారణకై చర్యలు చేపట్టాలన్నారు. అక్రమ ఇసుక రవాణా, పీడీఎస్‌ బియ్యం, పేకాట స్థావరాలను గుర్తించి ఆడేవారిని పట్టుకోవడం, తగిన కేసులు నమోదు చేసి వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ కర్రె స్వామి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.