2023-24 సంవత్సరానికి గాను యాదాద్రి భువనగిరి జిల్లాకు ఇన్‌స్పైర్ అవార్డులలో 132 ప్రాజెక్టులు ఎంపిక అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వము, ఎన్.ఐ.ఎఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము నిర్వహించే ఇన్స్పైర్ అవార్డ్ కార్యక్రమంలో గత ఆగస్టు , సెప్టెంబర్ నెలలో మన యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అర్హత గల 350 ఉన్నత , ప్రాథమికోన్నత పాఠశాలల నుండి గరిష్టంగా 1417 నామినేషన్లను సమర్పించి రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచినట్లు డీఈఓ నారాయణరెడ్డి తెలిపారు. ఈ నామినేషన్లను ఎన్.ఐ.ఎఫ్ ఇండియా, ఢిల్లీ వారు మూల్యాంకనం చేసి అందులో ఉన్న అత్యుత్తమ 132 ప్రాజెక్టులను జిల్లా స్థాయిలో జరిగే ఇన్స్పైర్ అవార్డు పోటిలకు ఎంపిక చేయడం జరిగిందనీ, ఈ విద్యార్థులందరికీ త్వరలో వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లో పదివేల రూపాయలు (Rs10,000) జమకానున్నాయని తెలిపారు. 2023-24 సంవత్సరానికి గాను పూర్వ నల్గొండ జిల్లాల నుండి యాదాద్రి జిల్లాకే అత్యధిక నామినేషన్లు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఎంపిక అయిన విద్యార్థుల ప్రాజెక్టులను తయారు చేసి ఈ సంవత్సరము సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జరిగే పోటీలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను, గైడ్ టీచర్లను , ప్రధానోపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పరిక్షల సహాయ కమిషనర్ కె కృష్ణారెడ్డి , జిల్లా సైన్స్ అధికారి భరణి కుమార్ లు పాల్గొన్నారు.