తారగై ఆరాధన… ఓ అసాధారణ అమ్మాయి. పుట్టిన మూడో రోజునే మొదటిసారి సముద్రాన్ని చూసింది. తండ్రి నుండి స్ఫూర్తి పొంది సముద్రాన్ని ఈదుతోంది. అంతేనా సముద్రంలోని వ్యర్థాలను బయటకు తెస్తోంది. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తోంది. తన వయసున్న ఎంతో మంది పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇటీవలె సముద్రం నుండి 3,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీసిన ఈ పదేండ్ల డైవర్ పరిచయం నేటి మానవిలో…
స్వయంగా డైవర్ అయిన తండ్రి కూతురు పుట్టిన మూడు రోజులకే సముద్రం చూపించాడు. అరాధన సముద్రాన్ని చూసిన ఆ మొదటి రోజు నుండే ఆమె జీవితం దానితో అల్లుకుపోయింది. తొమ్మిది నెలలు నిండే సరికి నీటిలో తనంతట తానుగా తేలుతూ ఉండేది. రెండేండ్లు నిండే సరికి ఈత కొట్టడం ప్రారంభించింది. ఐదేండ్ల వయసులో నీటి అడుగున ఊపిరి పీల్చుకోవడంలో మొదటి షాట్ చేసింది. ఎనిమిదేండ్లు వచ్చే సరికి తమిళనాడులోని రామేశ్వరం ఒడ్డు నుండి రెండు మీటర్ల లోతు వరకు డైవింగ్ చేసింది.
అంతకు మించి
అరాధన 10 ఏండ్ల వయసులోనే ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలైన PADI జూనియర్ ఓపెన్ వాటర్ డైవర్లలో ఒకరిగా, భారతదేశంలో సర్టిఫికేట్ పొందిన మొదటి అమ్మాయిగా గుర్తింపు పొందింది. చాలా మంది చిన్నపిల్లలు ఇలాంటి విజయాలకు పులకించిపోతారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు గొప్ప విజయాలు సాధించారని పొంగిపోతారు. కానీ ఆరాధన అలా పులకించిపోలేదు. ఆమె తండ్రి ఈ విజయాలకే పొంగిపోలేదు. ఆరాధన అంతకు మించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఆమె తండ్రి సముద్రం నుండి 30,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తే, అతన్నే అనుసరించిన ఆరాధన 3,000 కిలోల వ్యర్థాలను బయటకు తీసింది.
ప్లాస్టిక్ పేరుకుపోయింది
‘నా తండ్రి నాకు ప్రేరణ’ అంటూ ఆమె ఎంతో ఉత్సాహంగా చెబుతుంది. ‘నాకు డైవింగ్ అంటే చాలా ఇష్టం. సముద్రంలోని రంగురంగుల చేపలంటే మరీ ఇష్టం. మనమెల్కుడి జలాల్లో మనోహరమైన పగడాలు, చేపలు ఉన్నాయి. కానీ మన సముద్రపు నీటిలో చాలా వ్యర్థాలు ముఖ్యంగా ప్లాస్టిక్ పేరుకుపోయింది. బ్యాగులు, చెప్పులు, నీటి సీసాలు, క్యాప్‌లు, స్ట్రాలు… ఇలా ఎన్నో ఉంటున్నాయి. ఒకసారి మేము ఇలాంటి వ్యర్థాలలో చిక్కుకున్న రెండు తాబేళ్లను చూశాము. ఇలా ఎన్నో సముద్ర జీవులు వ్యర్థాల వలలో చిక్కుకుంటున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది’ అంటూ అరాధన చెప్పుకొచ్చింది.
తీర క్లీన్-అప్
‘ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుంది, దానికి బదులుగా మనం కూడా ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవాలి’ అనే విషయాన్ని ఆరాధన బలంగా నమ్ముతుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు సంఘాలు కలిసి రావాలని ఆమె కోరుతుంది. సముద్ర జీవులను రక్షించడం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడంపై ఆమె ఇప్పటి వరకు సుమారు 60కి పైగా జరిగిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొంది. ‘నేను నా వయసు పిల్లలపై దృష్టి పెడుతున్నాను. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం గురించి తర్వాతి తరానికి తెలియజేయడం చాలా ముఖ్యం అని మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. ఎనిమిదేండ్ల నా కజిన్ నిష్విక్, నేనూ కలిసి సముద్రాన్ని రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడానికి శ్రీలంక-టు-ఇండియా ఈతని 11 గంటల 30 నిమిషాల్లో చేసాము. అలాగే సేవ్ కింద 19 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ల ఈత కొట్టాము. ది ఓషన్ బ్యానర్ కింద ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రతి ఏడాది ఈ సమస్యపై దృష్టి సారిస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు, విజయవంతం చేసేందుకు ఇతరులను ప్రేరేపించాలనుకుంటున్నాను. ఈ విషయం గురించి నేను అవగాహన సదస్సుల్లో మాట్లాడినప్పుడల్లా ‘తీర క్లీన్-అప్’లో నాతో కలిసి ఉండమని వారిని అభ్యర్థిస్తున్నాను. నీటి అడుగున క్లీన్-అప్‌లలో మాకు సహాయం చేయడానికి మాకు నిజంగా ఎక్కువ మంది డైవర్లు అవసరం’ అంటుంది ఆమె.
నితంతరం స్ఫూర్తిగా
ఆరాధన తనకు 12 ఏండ్లు వచ్చేనాటికి అతి పిన్న వయస్కురాలైన మాస్టర్ స్కూబా డైవర్‌గా మారాలని, ఆ తర్వాత అతి పిన్న వయస్కురాలైన నీటి అడుగున వీడియోగ్రాఫర్ కావాలని ఆశిస్తోంది. ‘నేను అనుకున్నది సాధించడం కోసం నెమ్మదిగా, స్థిరంగా కృషి చేస్తాను’ అంటూ పంచుకుంది. ‘ప్రపంచంలో మీరు చూడాలనుకుంటున్న మార్పుగా ఉండండి’ అనే గాంధీజీ మాటలను నేను నితంతరం స్ఫూర్తిగా భావిస్తాను. దానికి అనుగుణంగానే నా ప్రయత్నాలు చేస్తాను అంటూ తన మాటలు ముగించింది పదేండ్ల డైవర్.