– బహెరిటేజ్ డెయిరీ జోనల్ ఇన్‌చార్జి సత్యనారాయణ
– హెరిటేజ్ డెయిరీ ఆధ్వర్యంలో
– పాడి రైతులకు అవగాహనా సదస్సు
– 100 మంది పాడి రైతులకు సబ్సిడీ రుణాలు అందజేత
నవతెలంగాణ-ఆమనగల్
హెరిటేజ్ డెయిరీ సంస్థకు పాలు పోసే పాడి రైతులకు ఉచితంగా రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నట్టు హెరిటేజ్ డెయిరీ జోనల్ ఇన్‌చార్జి సత్యనారాయణ అన్నారు. కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామంలో శుక్రవారం హెరిటేజ్ డయిరీ ఏజెంట్ శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో పశుపోషణ, పాల దిగుబడి తదితర అంశాలపై పాడి రైతులకు ఆ సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పాడి పరిశ్రమ నిర్వహించే రైతుల సౌకర్యార్థం హెరిటేజ్ డెయిరీ ద్వారా సబ్సిడీ ధరకు పశువుల దాణాను అందజేస్తుందన్నారు. పాడి పశువులకు ఇన్సూరెన్స్ విషయంలో సబ్సిడీ కల్పించడంతో పాటు, పాడి పరిశ్రమ నిర్వహిస్తూ హెరిటేజ్ డయిరీ సంస్థకు పాలు పోసే ప్రతి రైతుకూ ఉచితంగా రూ. రెండు లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. పశు పోషణలో మెళుకువలు పాటించి రెట్టింపు పాల ఉత్పత్తిని సాధించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం హెరిటేజ్ డయిరీకి పాలు పోసే 100 మంది పాడి రైతులకు రూ.50 వేల చొప్పున నగదు రూపంలో సబ్సిడీ రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ వెంకటేషం, ప్లాంట్ మేనేజర్ నరేష్, సూపర్‌వైజర్ శివ, డాక్టర్ ప్రభాకర్, ఏజెంట్ శ్రీశైలం, స్థానిక నాయకులు, పాడి రైతులు పాల్గొన్నారు.