– ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం : సూక్ష్మ చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈలు) కోసం కేరళ ప్రభుత్వం సమగ్ర బీమా పథకాన్ని ప్రారంభించింది. దీనివల్ల ఒడిదుడుకుల నుండి ఆ సంస్థలకు రక్షణ లభించడంతో పాటు పోటీ వ్యాపార వ్యవస్థలో వాటిలో విశ్వాసం పెరుగుతుంది. పథకం అమలు కోసం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ నాలుగు ప్రభుత్వ రంగ బీమా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పథకం కింద వార్షిక ప్రీమియంలో యాభై శాతాన్ని ఎంఎస్‌ఎంఈలకు రీయంబర్స్ చేస్తారు. పథకం వెబ్‌సైట్‌ను రాష్ట్ర పరిశ్రమల మంత్రి పి.రాజీవ్ ప్రారంభించారు. చిన్న, మధ్య తరహా సంస్థలు తమ వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఆ సంస్థలకు వాటి నుండి ఆర్థికపరమైన రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెబ్‌సైట్ ప్రారంభించిన సందర్భంగా రాజీవ్ తెలిపారు. బీమా సౌకర్యం వల్ల ఆయా సంస్థలు పురోభివృద్ధి సాధించేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని, తమ ఉత్పత్తులు, సేవల మార్కెట్‌ను విస్తరించుకునేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. ‘కేరళలో మూడు లక్షలకు పైగా ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. అయితే వీటిలో 15 వేల సంస్థలకు మాత్రమే బీమా సదుపాయం ఉంది. ఎంఎస్‌ఎంఈల డిమాండ్లను నెరవేర్చి, వివిధ పథకాలతో వాటికి అవసరమైన మద్దతు కల్పించడం ద్వారా ఆ సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని రాజన్ వివరించారు.