‘సమీకృత’ గురుకులాలు-ఆవశ్యకత

'Integrated' Gurukuls-Necessity”భారతదేశ బంగారు భవిష్యత్తు..తరగతి గదిలో రూపొందించబడుతుంది”-పండిత్‌ జవహార్‌ లాల్‌ నెహ్రూ. మనకు స్వాతంత్య్రం సిద్ధించి డెబ్బయిఏడేండ్లు గడిచినప్పటికీ ఆ దిశగా విద్యారంగం రూపొం దించబడలేదన్నది వాస్తవం. మౌలికంగా కొంత మార్పులైతే వచ్చినప్పటికీ అందరికీ విద్య అందే దిశగా అది అందడం లేదు. దేశంలో విస్తారమైన సహజవనరులు, అపారమైన మానవ సంపద వృద్ధి చెందినప్పటికీ ఆశించిన పద్ధతిలో మానవ వనరులు అభివృద్ధి చెందకపోవడం శోచనీయం. అయితే విద్యారంగ అభివృద్ధికి విద్యానిపుణులు, మేధావులు ప్రత్యామ్నాయ విధానాలకు తగిన సలహాలు, సూచనలు చేయడం అభినందనీయం. కాకపోతే అలా రూపొందిన విద్యా విధానాల ఫలితాలు ఈడేరకముందే ప్రజా బాహుళ్యం నుండి వచ్చిన వ్యతి రేకత, నిరుద్యోగం, కుచించుకుపోయే సంప్రదాయాలు, విలువలు పాలక వర్గాలను మిక్కిలి ఒత్తిడికి లోనుచేస్తున్నవి. ఈ పరిస్థితి ఆమూలగ్రంగా అర్థం చేసుకుంటే తప్ప ఆశించిన ఫలితాలు రావు. అంటే అనివార్యంగా ప్రస్తుతమున్న స్థితి నిర్ధారించుకుని, మదింపు చేసుకొని ప్రత్యామ్నాయ విధానాల్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది.
పూర్వ ప్రాథమిక దశలో (3-5వయస్సు విద్యార్థులు) గ్రూప్‌ అంగన్‌వాడీ, నర్సరీ, ఎల్‌కెజి, యుకేజి పేర్లతో పిల్లల కోసం ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలు శిక్షణనిస్తున్నవి. ప్రాథమిక దశలో (5-10వయస్సు) గ్రూప్‌ ఒకటి నుండి ఐదు తరగతుల వరకు మండల ప్రాథమిక, ప్రభుత్వ ప్రాథమిక, మినీ గురుకుల పాఠ శాలలుగా ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్వర్యంలో నిర్వహిచబడుచున్నవి. ప్రాథమికోన్నత దశలో (10-12 వయస్సు) గ్రూప్‌ ఆరేడు తరగతులు,ఉన్నత ప్రాథమిక, ప్రాథమికోన్నతపాఠశాలలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో , ప్రయివేటు యాజమాన్యంలో నిర్వహించబడుచున్నవి. ఇందుకు అదనంగా ఆరు, పది తరగతులు జవహార్‌ నవోదయ, మోడల్‌ స్కూల్స్‌,సైనిక్‌ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, స్పోర్ట్స్‌ స్కూల్స్‌, కస్తూర్భాగాంధీ, ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ గురుకులాలు ఇలా రకరకాల అంతరాల దొంతరగా రూపొం దుకున్నాయి. అయితే రాజ్యాంగంలో విద్య ఉమ్మడి జాబితాలో పొందుపర్చబడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పాఠశాలలు నడుస్తున్నప్పటికీ కొన్ని ధార్మిక సంస్థలు, మతపరమైన సంస్థలు, మరికొన్ని స్వచ్చంధ సంస్థలు కూడా పాఠశాలలు నిర్వహిస్తున్నవి.
కేంద్రం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యావిధానం విద్యారంగాన్ని మరింత సంక్లిష్టంలోకి నెట్టేసే విధంగా రూపొందించబడింది. ప్రస్తుతమున్న 10+2 విద్యా విధానం 5+3+3+4 విద్యా విధానంగా మార్చ బడింది. ఈ ప్రకారంగా నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి, ఒకటి, రెండు తరగతులు, పూర్వ ప్రాథమిక 3,4,5 తర గతులు, ప్రాథమిక విద్య 6,7,8 తరగతులు, 9,10,11,12 తరగతులు ఉన్నత విద్యగా రూపుదిద్దుకొంటాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు రద్దయి పాఠశాల డైరెక్టరేట్‌లో మిలితమవుతుంది. ప్రస్తుతం కొన్ని పాఠశాలలు పది తరగతులు వరకు నిర్వహిస్తుండగా మరి కొన్ని పాఠశాలు పన్నెండు తరగతుల వరకు (సిబిఎస్‌ఇ) నిర్వహించడం వలన కళాశాల విద్యావిధానంలో కొంత గందరగోళం, అస్పష్టతకు దారితీసే పరిస్థితిలో జాతీయ నూతన విద్యావిధానం ఉందని చెప్పవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ గురుకులాల్లో భాగంగా తెలంగాణలో 35 ప్రభుత్వ గురుకులాలు ఉండగా 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటికి అదనంగా మరో 992 కొత్త గురుకులాలు ఏర్పాటు చేయబడినవి. ఇవన్నీ కూడా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పరిధిలో నడుస్తున్నవి. ఆయా చట్టబద్ధత కలిగిన సొసైటీల ద్వారా కొన్ని 5-10 తరగతులు, మరికొన్ని 5-12 తరగతులు నిర్వహిస్తున్నవి. ఇందులో సగానికి సగం అద్దె భవనాలు, అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నవి. అందులోనూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు, విద్యావాలంటీర్లతో విద్యాభోదన చేస్తున్నది. ఆయా పాఠశాలలు కాలనిర్ణయ పట్టిక, తరగతుల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతభత్యాల్లో ఏక రూపత లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మిక్కిలి అసంతృప్తికి గురౌతున్నది వాస్తవం.
కొత్తగా నియోజకవర్గానికొకటి చొప్పున సమీకృత గురుకులాల్ని ప్రారంభించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తున్నది. ఇది మంచి విషయమే కానీ, అంతకుముందు ఉన్న గురుకులాల్లో కూడా సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. దేశంలో కులాలు,మతాలుగా ప్రజల్ని విభజించి పాలిస్తున్న ప్రస్తుత తరుణంలో దళితులు,గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలందరూ ఒకే క్యాంపస్‌లో, ఒకే గొడుకు కింద విద్యనభ్యసించుటకు సమీకృత గురుకులాల ఏర్పాటు అత్యంత ఆవశ్యకం. ఆచరణలో ఇది సాధ్యం కావాలంటే పాలకులకు కావాల్సింది సంకల్పం, చిత్తశుద్ధి. దీంతో పాటు విద్యారంగానికి వార్షిక బడ్జెట్‌లో కనీసం ఇరవైశాతం నిధుల కేటాయింపు. ఇలా ఆలోచించి అడుగు ముందుకేస్తే గనుక గురుకులాల్లో సమీకృత భావనను సార్థకం చేయవచ్చు.
– సురభి జగపతిరావు, 9441772772