ఇంటర్‌ బోర్డు నిర్లక్ష్యం…

– ఇంగ్లీష్‌ ప్రాక్టికల్‌లో తప్పులు
– ఆర్థిక మంత్రి పేరు హరీశ్‌రావు అంటూ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శుక్రవారం మొదటిసారిగా నిర్వహించిన ఇంగ్లీష్‌ ప్రాక్టికల్‌ నిర్వహణలో ఇంటర్‌ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి. స్వచ్ఛ బడి క్లీన్‌ తెలంగాణ అనే ప్రశ్నలో ఆర్థిక మంత్రి పేరు టి హరీశ్‌రావును ముద్రించారు. ఆ ప్రశ్నను సవరించకుండా యథాతధంగా విద్యార్థులకు ఇచ్చి పరీక్షను నిర్వహించారు. ఇంటర్‌ బోర్డు అధికారుల తీరుపై పలువురు అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గతేడాది డిసెంబర్‌ మూడో తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఏడో తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. కానీ ఇంటర్‌ బోర్డు అధికారులు మాత్రం ఆర్థిక మంత్రి పేరు ఇంకా టి హరీశ్‌రావు పేరును ముద్రించడం చర్చకు దారితీసింది.
4.78 లక్షల మంది విద్యార్థుల హాజరు : ఇంటర్‌ బోర్డు
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో మొదటిసారిగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్‌ సబ్జెక్టుకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాక్టికల్‌ను నిర్వహించామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. రెండు విడతల్లో ఈ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగాయని పేర్కొన్నారు. 3,200 కాలేజీల్లో 4,78,600 మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారుల వివరాల ప్రకారం ఈ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ఈనెల 28 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రథమ సంవత్సరం నుంచి 4,78,527 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 4,43,993 మంది కలిపి 9,22,520 మంది విద్యార్థులు హాజరవుతారు.