నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫలితాలు ఈనెల 24 లేదా 25న విడుదలయ్యే అవకాశమున్నట్టు విశ్వ సనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 28న ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. గతనెల 19 వరకు అవి జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.గతనెల నాలుగో తేదీ నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే .రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో నిర్వహించారు. ప్రస్తుతం ఫలితాలకు సంబంధించిన ప్రాసెసింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోనూ ఎన్నికల కమిషన్ (ఈసీ) అనుమతి తీసుకుని ఇంటర్ ఫలితాలను ఈనెల 24 లేదా 25న విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.