ఇంటర్‌ స్పాట్‌ డీఏ వెంటనే ఇవ్వాలి

– విద్యాశాఖ కార్యదర్శికి టీపీటీఎల్‌ఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌లో పాల్గొన్న అధ్యాపకులకు డీఏ, రెమ్యూనరేషన్‌ను వెంటనే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రయివేట్‌ టీచర్లు లెక్చరర్ల ఫెడరేషన్‌ (టీపీటీఎల్‌ఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎ విజరుకుమార్‌, నాయకులు కొమ్ము విజరు, పుట్టపాగ విజరు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేశ్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. మార్చ్‌, ఏప్రిల్‌లో జరిగిన ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌లో పాల్గొన్న లెక్చరర్లకు ఇప్పటివరకు డీఏ ఇవ్వకుండా ఆపారని తెలిపారు. రెండు నెలలు గడిచినా ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. డీఐఈవోలను అడిగితే విద్యాశాఖ నుంచి ఆలస్యమవుతున్నట్టు సమాధానమిస్తున్నారని పేర్కొన్నారు. డీఏ ఇంకా తాత్సారం చేయకుండా వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్పాట్‌ రెమ్యూనరేషన్‌ కూడా ఇంకా ఇవ్వలేదని తెలిపారు. ఆన్‌లైన్‌ పేరుతో ఆలస్యం చేయడం సరైంది కాదనీ, వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు.