– 2023 డిసెంబర్-మార్చి 2024 త్రైమాసికానికి విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వడ్డీలేని రుణాల పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయ గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 267, 34,00,000 విడుదల చేసింది. ఈ మేరకు సెర్ప్ సీఈఓ అనితా రామ చంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు మూడు నెలలకు సంబంధించిన వడ్డీ రాయితీ అందనున్నది. దీని ద్వారా రాష్ట్రంలోని 2,53,864 ఎస్‌హెచ్ జీ గ్రూపులకు లబ్ది చేకూరనున్నది. ఈ రుణాలు నేరుగా ప్రభుత్వ ఖాతా నుంచి స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలోని 16,248 గ్రూపులకు రూ.17.09 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరనున్నది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలోని 15,300 గ్రూపులకు రూ.16.57 కోట్లు, ఖమ్మం జిల్లాలోని 14,355 గ్రూపులకు రూ.15.84 కోట్లు అందనున్నాయి. అత్యల్పంగా కొమ్రం భీం జిల్లాలోని 2759 గ్రూపులకు రూ.2.42 కోట్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 2,211 గ్రూపులకు రూ.2.49 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలోని 3282 గ్రూపులకు రూ.2.92 కోట్ల లబ్ది చేకూరనున్నది.