ఆద్యంతం ఆసక్తికరం…

Very interesting...‘మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా.అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకుడు. సత్యం రాజేష్‌, కామాక్షి భాస్కర్ల ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికష్ణ నిర్మాత. ఈనెల 3న పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీరిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు హీరో అడవి శేష్‌తో పాటు నిర్మాత ఎస్‌కేఎన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ వేదికపై చిత్ర బిగ్‌ టికెట్‌ను అతిథులు అడవి శేష్‌, ఎస్‌కేఎన్‌ ఆవిష్కరించారు. అడవి శేషు మాట్లాడుతూ, ‘నా ఫస్ట్‌ సక్సెస్‌ ‘క్షణం’కు వర్క్‌ చేసిన టీమ్‌ అంతా ఈ టీమ్‌లో ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్‌ నాకు మంచి స్నేహితుడు. అతను ఓ బ్లాక్‌బస్టర్‌ సినిమా తీసి, దానికి సీక్వెల్‌ తీయడం ఆనందంగా ఉంది. ఇది నా సొంత సినిమా లాంటింది. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ, ‘చిన్నసినిమాగా మొదలైన ఈ సినిమా ఈ రోజు పెద్ద సినిమాగా మారిందంటే అందుకు కారణం వంశీ నందిపాటి. అలాగే నాకు బడ్జెట్‌ పరంగా సహకరించిన నిర్మాతకు థ్యాంక్స్‌’ అని తెలిపారు.
సత్యం రాజేష్‌ మాట్లాడుతూ,’ఈ రోజు ఇంత గొప్పగా 100 కోట్ల సినిమాలా కాన్ఫిడెంట్‌గా విడుదల చేస్తున్నామంటే వంశీ నందిపాటి కారణం. ఈ సినిమాకు టెక్నిషియన్సే హీరోలు. ఈ చిన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ,’దర్శకుడు ఈ కథను ఎంతో అద్భుతంగా తీశాడు. తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.