అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవాన్ని మండలంలోని చిన్నవంగర కస్తూర్బా బాలికల విద్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. గాడిపెల్లి కృష్ణప్రసాద్ సహకారంతో, మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ తొర్రూరు ఆధ్వర్యంలో స్థానిక కేజీబీవీ పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మదర్ వాలంటరీ తొర్రూరు మండల అధ్యక్షుడు కాసోజు సాయినాథ్ మాట్లాడుతూ.. స్వచ్ఛంద సేవకుల గుర్తింపు కోసం వాదించడం, అభివృద్ధి కార్యక్రమాలలో స్వచ్ఛంద సేవను ఏకీకృతం చేయడానికి భాగస్వాములతో కలిసి పనిచేయాలన్నారు. తద్వారా శాంతి, అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సురేష్ బాబు, రాజేష్, చందు రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.