ఇంటర్నెట్‌ కేఫ్‌

Internet Cafeఅమెజాన్‌ అనే గ్రామంలో ఉన్న ‘ఇంటర్నెట్‌ కేఫ్‌’ ముందు ధర్నా చేస్తున్నారు, ఆ గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు.స్నూకర్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. నగరంలో కొన్ని సంవత్సరాలు ఉద్యోగ అన్వేషణ చేసి విసిగిపోయాడు. తిరిగి తన సొంత ఊరు చేరుకున్నాడు. కొడుకు బాధ చూడలేక తండ్రి కొంత డబ్బును ఇచ్చాడు. ఆ డబ్బుతో కొన్ని కంప్యూటర్లు కొని ఆ గ్రామంలో ‘ఇంటర్నెట్‌ కేఫ్‌’ పేరుతో కేఫ్‌ ను ప్రారంభించాడు.
కేఫ్‌ను ఏర్పాటు చేసిన దగ్గర నుండి అమెజాన్‌లో ఉన్న విద్యార్థులంతా పాఠశాల నుండి ఇంటికి రాగానే స్కూల్‌ బ్యాగ్‌ ఇంట్లో పడేసి కేఫ్‌కి వెళ్ళేవారు. సెలవు రోజుల్లో కూడా ఇంటిని మరిచి పొద్దస్తమానం అక్కడే గడిపేవారు. చదువన్న ఊసేలేదు. కంప్యూటర్‌లో రకరకాల గేమ్స్‌ ఆడేవారు.
‘స్నూకర్‌ ఊరిలో కేఫ్‌ను పెట్టి పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్నాడు’ అని తల్లిదండ్రుల ఆవేశం కట్టలు తెచ్చుకుంది. అందుకే ఆ ధర్నా. పిల్లల తల్లిదండ్రులని పిలిచి అక్కడ కూర్చోబెట్టి ఎలాగోలాగా స్నూకర్‌ వారికి సర్ది చెప్పాడు.
”నాన్నా… కేఫ్‌ దగ్గరికి ఎందుకు వెళ్లారు? స్నూకర్‌ అన్నయ్య ఏం చేశారు? మాకు కంప్యూటర్‌ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. వినోదం కోసం కాసేపు కంప్యూటర్‌లో గేమ్స్‌ ఆడుకుంటున్నాం” అని చార్లెస్‌ అనే విద్యార్థి తన తండ్రిని ప్రశ్నించాడు
”మీరు ఇంటర్నెట్‌ అన్నయ్య జోలికి వెళ్తే మేం రేపటినుండి స్కూలుకు కూడా వెళ్ళం” అని ఇంకో విద్యార్థి తన తండ్రితో వాదనకు దిగాడు.
”చార్లెస్‌ నువ్వే కాదు. మీ స్నేహితులు, మన ఊరి విద్యార్థులందరూ ఇక నుండి సంతోషంగా కేఫ్‌ కు వెళ్ళండి” అని జవాబిచ్చాడు చార్లెస్‌ తండ్రి. చార్లెస్‌ తండ్రి వంక ఆశ్చర్యంగా చూశాడు. ”అవునురా! ఇకనుండి నీకు అడ్డు చెప్పను” అని అన్నాడు. ”థాంక్యూ నాన్నా ”అంటూ గట్టిగా హత్తుకున్నాడు చార్లెస్‌.
”స్నూకర్‌ అన్నయ్య నాన్నకి జ్ఞానోదయం చేసినట్లున్నాడు” అని మనసులోనే అనుకుని సంతోషించాడు. తమ తల్లిదండ్రుల నుండి అనుమతి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మరుసటి రోజు ఆదివారం కావడంతో విద్యార్థులంతా ఒక్కొక్క కంప్యూటర్‌ ముందు నలుగురు, ఐదుగురు కూర్చుని ఆటలు ఆడుతున్నారు. వారందరిని గమనించాడు స్నూకర్‌. పేరెంట్స్‌కి ఇచ్చిన మాట ప్రకారం తను తయారు చేసిన ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్స్‌కి ఇన్‌స్టాల్‌ చేశాడు.
విద్యార్థులు కంప్యూటర్‌లో ఆటలు ఆడుతుండగా మధ్యలో గణితానికి సంబంధించిన కొన్ని లెక్కలు వచ్చాయి. ‘ఇదేంటి’ అని ఆశ్చర్యపోయారు విద్యార్థులు. ‘సరే’ అని ఆ అభ్యాసాన్ని సాధించారు. ‘వావ్‌! యు ఆర్‌ గ్రేట్‌’ అంటూ కంప్యూటర్‌ మెచ్చుకుంది. ఇంతకు ముందు ఎవరూ అలా మెచ్చుకోకపోవడంతో చాలా ఆనందించారు విద్యార్థులు.
మరొక రోజు స్పోకెన్‌ ఇంగ్లీష్‌లో కొన్ని వాక్యాలు ఆట మధ్యలో వినిపించాయి. వాటికి కూడా చక్కటి సమాధానాలు ఇవ్వగానే ‘వావ్‌! ఎక్స్లెంట్‌ యువర్‌ లాంగ్వేజ్‌’ అని మెచ్చుకుంది కంప్యూటర్‌. విద్యార్థుల ఆనందానికి అవధులే లేవు.
ఆటల మధ్యలో గణితం, ఇంగ్లీష్‌, జనరల్‌ స్టడీస్‌ కు సంబంధించిన విషయాలు వస్తూనే ఉన్నాయి. వాటిని నేర్చుకుంటూనే ఆటలు ఆడుతూ విద్యార్థులు గడిపారు.
కొన్ని రోజుల తర్వాత స్నూకర్‌ కంప్యూటర్‌లో ఆటలు తగ్గించాడు. విద్యార్థులు వాటి గురించి పట్టించుకోలేదు. చదువుకు సంబందించిన మంచి ప్రశ్నలు రావడంతో వాటికే అలవాటుపడ్డారు. విద్యార్థులు కంప్యూటర్‌లో ఆటలు ఆడటం మరచిపోయి చదువునే ఆటగా నేర్చుకోవడం ప్రారంభించారు. చదువులో మంచి ప్రతిభను కూడా కనబరిచారు.
తమ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషించారు. ‘పిల్లలకు ఇష్టమైన వాటిని ఆటలుగా మార్చి నేర్పితే వారు ఈజీగా నేర్చుకుంటారు. పిల్లలను అది చేయవద్దు.. ఇది చేయవద్దని మందలిస్తే వారు ఇంకా ఎక్కువ మంకు పడతారు. అందుకే నేను వారికి ఇష్టమైన ఆటల్లోనే చదువుకు సంబంధించిన విషయాలను చేర్చాను. వారు ఆడుతూ పాడుతూ నేర్చుకున్నారు. వారు చేసిన చిన్న చిన్న పనులను కూడా మనం అభినందించాలి” అని విద్యార్థుల తల్లిదండ్రులతో చెప్పాడు స్నూకర్‌. తమ తప్పు తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పుడూ అభినందించేవారు. పిల్లలంతా చాలా సంతోషించారు.
– ముక్కామల జానకీరామ్‌,
6305393291