మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలు

– పునరుద్ధరణ : సీఎం బీరెన్‌ సింగ్‌
ఇంఫాల్‌ : రెండు జాతుల మధ్య ఘర్షణలతో గత నాలుగు నెలలుగా అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించారు. మే 3న కుకీ, మైతీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడటంతో ఇంటర్నెట్‌ సేవలను తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ శనివారం ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో.. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సదుపాయాలు సహా వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీనిపై సమీక్షించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.