– లెక్కలతో కుస్తీపడుతున్న ఆయా పార్టీల నేతలు
– ఉమ్మడి కరీంనగర్‌లో బూత్‌లవారీగా అభ్యర్థుల లెక్కలు
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్‌లో పోటీలో ప్రధానపార్టీల అభ్యర్థులు అంతర్మథనంలో పడ్డారు. బూత్‌లవారీగా పోలైన ఓట్లలో తమకు అనుకూలంగా పడిన వాటి లెక్కలను కిందిస్థాయి శ్రేణుల నుంచి తెలుసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ఆ లెక్కలతో కుస్తీ పడుతున్నారు. ‘మా నాయకుడిదే విజయమంటే.. లేదు.. మా నాయకునిదే గెలుపు’ అంటూ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్‌శాతం చూస్తే పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా 70శాతం దాటలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 80శాతంపైనే పోలింగ్ నమోదైంది. అయితే సిరిసిల్ల, కరీంనగర్ తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం ఎక్కువగానే నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 2018 ఎన్నికల్లో 79.69శాతం నమోదైతే ఈ ఎన్నికల్లో 75.64శాతమే ఓట్లు పడ్డాయి. పెద్దపల్లి జిల్లాలో 2018 ఎన్నికల్లో 80.47శాతం పోలింగ్ నమోదైతే ఈ ఎన్నికల్లో 75.62శాతమే వేశారు. జగిత్యాల జిల్లాలో గత ఎన్నికల్లో 78.28శాతం ఓట్లు పోలైతే ఈ ఎన్నికల్లో 76.12శాతమే పోలింగ్ నమోదైంది. సిరిసిల్ల జిల్లాలో 2018 ఎన్నికల్లో 80.72శాతం ఓట్లు పడితే ఈ ఎన్నికల్లో 75.92శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. సాధారణంగా ఓట్ల శాతం పెరిగితే ప్రత్యర్థి పార్టీలకు మేలు జరుగుతుందన్న రాజకీయవిశ్లేష కులు చెబుతుంటారు. ఇప్పుడు గత ఎన్నికలతో పోల్చితే 5 నుంచి 7శాతం ఓటింగ్ తగ్గడం చూస్తుంటే అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల మధ్య గట్టిపోటీయే ఉంటుందని అంటున్నారు. గెలుపోటములపై చర్చోపచర్చలు ప్రజల్లో సాగుతున్నాయి. పోలింగ్ ముగియగానే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ముఖ్య అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. పోలింగ్ రోజు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ పలువురు సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు 424 ఫిర్యాదులు అందగా ఇందులో పోలింగ్ రోజుకు సంబంధించినవి 30 ఉన్నాయి. ఫిర్యాదులు ఆధారంగా సంబంధిత తనిఖీ బందాలతో విచారణ చేపట్టారు.
కాంగ్రెస్ ధీమా.. కారులో గుంభనం
మెజార్టీ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా వ్యక్తమవుతోంది. సంబురాలకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చినా 3 వరకు వేచి ఉందామనే రీతిలో నేతలు ఉన్నారు. కరీంనగర్‌లో మాత్రం కాంగ్రెస అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్, అతని శ్రేణులు సంబురాలు నిర్వహించారు. వేములవాడ, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాల్లో గెలుపుపై గట్టిగానే ధీమాతో ఉన్నారు. మానకొండూర్‌లోనూ ఉంది. గత ఎన్నికల్లో కూడా ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్‌వైపే ఉన్నా.. ఫలితాలు మాత్రం బీఆర్‌ఎస్‌కే వచ్చాయి. దీంతో ఆ సర్వే సంస్థల రిపోర్టుపై బీఆర్‌ఎస్ శ్రేణులు అపనమ్మకంగానే ఉన్నారు. స్వల్ప మెజార్టీతో అయినా తమ పార్టీ అభ్యర్థి గెలుపును అందుకుంటాడన్న చర్చలతో గులాబీ శ్రేణులు గుంభనంగా ఉన్నాయి.