– ఢిల్లీ మద్యం కేసులో కవిత నుంచి సీబీఐ ఆరా
– దశలవారీగా స్టేట్‌మెంట్ రికార్డు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తొలిరోజు సీబీఐ అధికారులు సుమారు మూడు గంటల పాటు విచారించారు. కోర్టు ఆదేశాలు, నిబంధనల ప్రకారం… ఢిల్లీ లోధి రోడ్ – జవహర్ లాల్ నెహ్రు మార్గ్ లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆమె స్టేట్‌మెంట్ ను రికార్డు చేశారు. విశ్వసనీయంగా సేకరించిన సమాచారం ప్రకారం.. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలన్న కోర్టు ఆదేశాల ప్రకారం… తొలుత ఆమెకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఉదయం 10 గంటల తరువాత ఆమెను విచారణ గదికి తీసుకెళ్లారు. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితను విచారించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, పాలసీ అమలు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, సహ నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్, ఇతర ఆధారాలపై కవితను ప్రశ్నించారు. ముఖ్యంగా కవిత సన్నిహితుడు అభిషేక్ బోయిన పల్లి, మాజీ సీఏ బుచ్చిబాబు, ఇండో స్పిరిట్ లో కవిత బినామీగా ఆరోపిస్తోన్న అరుణ్ రామ చంద్ర పిళ్లై, శరత్ చంద్రా రెడ్డి స్టేట్‌మెంట్లపై ఆరా తీశారు. అలాగే అప్రూవర్లుగా మారిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, దినేశ్ అరోరాల వాంగ్మూలాలపై ప్రశ్నించింది. ప్రధానంగా బుచ్చిబాబు ఫోన్లో దొరికిన వాట్సాప్ చాట్స్, ఫోన్ కాల్స్, ఇతర ఆధారాల ముందు పెట్టుకొని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. లిక్కర్ పాలసీ రూపకల్పన లో భాగంగా ఢిల్లీ, హైదరాబాద్ లోని పలు హౌటల్స్ లో జరిగిన సమావేశాల ఫోటో గ్రాప్స్ పై కవిత స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. కాగా, ఈనెల 11న తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. 12న ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చగా… కవిత విచారణకు సహకరించడం లేనందున, మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. అయితే ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు… కేవలం కవితను మూడు రోజుల కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించింది. తిరిగి ఈ నెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, గత నెల 15న లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
కేజ్రీవాల్ టార్గెట్ గా ప్రశ్నలు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా కవితను విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన కేజ్రీవాల్ డైరెక్షన్ లో జరిగితే… సౌత్ గ్రూప్ నుంచి కవిత కీ రోల్ పోషించినట్టు దర్యాప్తు సంస్థలు చార్జీషీట్ లో ప్రస్తావించాయి. అందువల్ల ఈ నేతలిద్దరి మధ్య లిక్కర్ పాలసీ లింకులపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఇదే సందర్బంలో అప్రూవర్ గా మారిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఏకంగా కేజ్రీవాల్ ను కలిసి పాలసీ పై ఆసక్తి చూపినట్టు సీబీఐ పేర్కొంది. పాలసీపై కవితను కలవాలని కేజ్రీవాల్ సూచించినట్టు అందులో పేర్కొంది. దీంతో కేజ్రీవాల్, కవితల మధ్య పాలసీ రూపకల్పనపై చర్చ జరిగినట్టు ఆరోపిస్తోంది. అయితే కేజ్రీవాల్, కవితలు జోక్యం చేసుకున్నట్టు అయినట్లు కీలకమైన ఆధారాలను మాత్రం దర్యాప్తు సంస్థలు సేకరించలేకపోయాయి. అలాగే చేతులు మారిన రూ. 100 కోట్ల హవాల డబ్బు ఎక్కడిది, ఎక్కడికి పోయాయి అనే విషయలోనూ స్పష్టత రాలేదు. దీంతో తొలుత కవితను సాక్షిగా చూపిన దర్యాప్తు సంస్థలు… ఈ కేసులో అప్రూవర్లు, సహ నిందితుల స్టేట్‌మెంట్లు, వారి ఫోన్లలో లభ్యమైన వాట్సాప్ చాట్ ల ఆధారంగా కవితను నిందితు రాలిగా చూపిస్తున్నాయి. అయితే, ఈడి 10 రోజుల కస్టడీ, ప్రస్తుత సీబీఐ కస్టడీలోనూ కవిత గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్లకే కట్టుబడి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో తనకు సంబంధం లేదని, పలు విషయాలను మరిచిపోయానని, తెలియదనే సమాధానం ఇచ్చారు.
కవితను కలిసిన భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు
సీబీఐ కస్టడీలో ఉన్న కవితను తొలి రోజు భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు, పీఎ శరత్ లు కలిసారు. కస్టడీలో ఉన్న సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు వీరికి కోర్టు అనుమతించింది. తొలుత అరగంట న్యాయవాది కవితను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. మరో 15 నిమిషాలు కుటుంబ సభ్యులు కలవొచ్చని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో శనివారం సాయంత్రం 5:50 గంటలకు భర్త అనిల్, మోహిత్ రావు, శరత్ లతో కలిసి సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తొలి రోజు కావడంతో… కోర్టు ఆదేశాల కాపీ, వ్యక్తిగత సమాచారాన్ని అందించిన తరువాత వీరిని కవితను కలిసేందుకు అనుమతించారు.