నకిలీ సిమ్‌కార్డుల అంతర్‌ర్రాష్ట్ర ముఠా అరెస్టు

– వారి నుంచి పెద్ద ఎత్తున నకిలీ సిమ్‌లు స్వాధీనం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌
నకిలీ సిమ్‌కార్డులతో పాటు బ్యాంకు అకౌంట్‌లను ట్యాగ్‌చేసి సైబర్‌క్రైమ్‌ నేరస్తులకు పెద్దఎత్తున విక్రయిస్తున్న ముఠా గుట్టును రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రట్టు చేశారు. సుభానీ, నవీన్‌, ప్రేమ్‌కుమార్‌ అనే ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి పెద్దఎత్తున సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ అదనపు డీజీ సికాగోయల్‌ తెలిపిన వివరాల ప్రకారం…నకిలీ సిమ్‌కార్డులను తయారుచేస్తున్న ముఠా గురించి సమాచారం అందగానే సీఎస్‌బీకి చెందిన ఎస్పీ కేవీ ప్రసాద్‌ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు చెందిన సుభానీ, నవీన్‌, ప్రేమ్‌కుమార్‌ సిమ్‌కార్డులను తయారుచేసేవారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సైబర్‌ నేరస్తుల నుంచి కూడా వాటిని కొనుగోలు చేసేవారు. వాటిని దుబాయికి చెందిన సైబర్‌ నేరస్తుడు విజరుకు అమ్మేవారు. వాటిని తీసుకెళ్లడానికే విజరు తరుచూ హైదరాబాద్‌ వచ్చి వివిధ వ్యక్తుల బ్యాంకు అకౌంట్‌ పుస్తకాలను, సిమ్‌లను తీసుకెళ్లేవాడు. వాటికిగానూ ఒక్కోదానికి రూ.500 నుంచి రూ.1500 దాకా చెల్లించేవాడు. వాటిని చైనా, సింగపూర్‌, కాంబోడియా దేశాలకు చెందిన సైబర్‌ నేరస్తులకు విక్రయించేవాడు. ఈ విధంగా తయారు చేసిన నకిలీ సిమ్‌కార్డులు, బ్యాంక్‌ అకౌంట్‌ పుస్తకాల ఆధారంగా సైబర్‌నేరస్తులు పెద్దమొత్తంలో మోసాలకు పాల్పడేవారని తేలింది.