ప్రధాని విద్వేష వ్యాఖ్యలపై జోక్యం చేసుకోండి

– సుప్రీంకోర్టుకు ఎఐకెఎస్‌ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని ఎఐకెఎస్‌ తీవ్రంగా ఖండించింది. దేశంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సామరస్యాన్ని పణంగా పెట్టి ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రజలను మతపరంగా విభజించడానికి చేసిన ప్రయత్నంగా ఈ ప్రసంగాన్ని ఎఐకెఎస్‌ విమర్శించింది. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పూర్తిగా అబద్ధాలపై ఆధారపడి విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించడం ఆ పదవి ప్రతిష్టను దిగజార్చడమేని ఆరోపించింది. ఈ కేసులో మోడీ ప్రవర్తన మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసిసి)ని ఉల్లంఘించడమే కాదు, ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద తీవ్రమైన నేరాలకు పాల్పడటంతో సమానమని తెలిపింది. ఎంసిసిని ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు ప్రధాని మోడీపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్య తీసుకోకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని, వీలైనంత త్వరగా జోక్యం చేసుకోవాలని ఎఐకెఎస్‌ విజ్ఞప్తి చేసింది. పదేళ్ల మోడీ పాలనపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రితో సహా బిజెపి నాయకులంతా విద్వేష రాజకీయాలను ఆశ్రయిస్తున్నారని ఎఐకెఎస్‌ ఆరోపించింది. ఎంసిసిని ఉల్లంఘించిన ప్రధానమంత్రి మోడీ తదుపరి ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నిరోధించాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా మోడీపై నిషేధం విధించాలని ఎఐకెఎస్‌ డిమాండ్‌ చేసింది. ఎంఎస్‌పికి సంబంధించిన చట్టపరమైన హామీతో పాటు ఇతర హామీలను నెరవేర్చకుండా రైతులను మోసం చేసినందుకు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఘోరంగా ఓడించి గుణపాఠం చెప్పాలని ఎఐకెఎస్‌ పిలుపునిచ్చింది.