– తెలంగాణ పరిచయాంశాలు
– ఆరు దశాబ్దాల పాటు జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితం నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
– భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం 2014, జూన్ 2న ఏర్పడింది.
– ఉద్యమ చరిత్రకు స్వస్తిపలికి ఒక నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్రం.
– మాతృభాష తెలుగైనప్పటికి 1948 వరకు తెలుగు వాడుకలో లేదు.
– ప్రభుత్వ వ్యవహారాల విషయంలో గానీ పాఠశాల విద్యాభ్యాసంలో గానీ ఉర్దూ భాష వాడుకలో ఉండేది.
– గ్రామాధికారుల, భూస్వాముల మత దురహంకారుల దౌష్ట్యాన్ని ఎదురించి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకై తమ ప్రాణాలనే ఆర్పించిన ఘనత తెలంగాణ రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలకు దక్కింది.
– తెలుగు ప్రజలు ఎక్కడున్నా అందరూ ఒకే గొడుగు కిందకి రావాలనే ఆశయం తెలంగాణ ప్రజలను స్వాగతించినప్పటికి, మంత్రివర్గ పదవుల్లో, ఉద్యోగ నియామకాల్లో తమపట్ల, తమ ప్రాంతం పట్ల చూపిన వివక్షత, సమాన గౌరవ ప్రతిపక్తులు ఇవ్వలేదని ప్రజలలో, నాయకులలో గట్టిగా నాటుకోంది. దీని పర్యవసానమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారి తీసింది.
తెలంగాణ పద ఆవిర్భావం
– తెలంగాణ అనే పదం అత్యంత ప్రాచీనమైంది.
– తెలంగాణలో జీవనదైన గోదావరిని ‘తెలివాహ నది’గా పిలుస్తారు. అందువలన ఈ నది పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలను త్రిలింగులుగా పిలిచేవారు.
– కాలక్రమంగా త్రిలింగ దేశంగానూ, తెలంగాణగానూ పేరు ఏర్పడింది.
– మలి మౌర్యుల కాలంలో వచ్చిన గ్రీకు రచనలులో కూడా ఈ పేరు కన్పిస్తుంది
– రాజ శాసనాల్లో త్రిలింగ, తిలింగ, తెలంగ అనే శబ్దాలను విరివిరిగా వాడారు.
– తెలంగాణ పదాన్ని సార్ధకం చేసి స్థిరపరిచిన ఘనత కాకతీయానంతర రచయితలకు దక్కింది.
– కాకతీయుల కాలంనుండి జరిగిన ముస్లిం దండయాత్రల కారణంగా తెలంగాణ అనే పేరు వ్యవహారికంగా మారింది.
తెలంగాణ పదం – శాసన ఆధారాలు
– క్రీ.శ.1417లో తెల్లాపూర్ (సంగారెడ్డి జిల్లా) శాసనంలో తెలంగాణ అనే పదం కన్పిస్తుంది.
– ప్రతాప రుద్రగణపతి వెలిచర్ల శాసనంలో, శ్రీకృష్ణ దేవరాయల తిరుమల చిన్న కంచి శాసనాల్లో తెలంగాణ పదం స్పష్టంగా పేర్కొనబడింది.
– కాకతీయుల కాలంలో కొన్ని బ్రాహ్మణ శాఖలను తెలంగాణ్యులు అనే వారు అంటే తెలంగాణకు చెందిన వారిగా పిలిచేవారు.
– తెలంగాణ పదంలో ‘ఆణెము’ అంటే దేశము కాబట్టి గోలకొండ స్థాపన సమయంలో కూడా తెలంగాణ పదంలో వాడకం బాగా ప్రాచుర్యాన్ని పొందింది.
– ఈ విధంగా నేటి తెలంగాణ అనే పదం రూపురేఖలు దిద్దుకుంటూ ఆవిర్భవించింది.
తెలంగాణ చారిత్రక ప్రాముఖ్యత
– తెలంగాణ చరిత్రకు విేష ప్రాముఖ్యత ఉంది.
– చరిత్ర పూర్వ యుగం నుంచి సమకాలీన చరిత్ర వరకూ ఈ ప్రాముఖ్యత విస్తరించింది.
– పాత రాతి యుగానికి చెందిన పనిముట్లు ఆవాస స్థలాలు, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో లభ్యమయ్యాయి.
– మానవ నాగరికతా ప్రగతి పథంలో ప్రధాన భూమిక వహించిన పాత, మధ్య, నవీన శిలాయుగాల సంస్కృతులకు తెలంగాణ రాష్ట్రం ఒక కేంద్ర బిందువుగా ఉంది.
– క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఏర్పడిన జన పదాలలో ఒకటైన అస్మక జనపదం, నిజామాబాద్ ప్రాంతంలో ఉంది. అస్మక జనపదానికి నేటి బోధన్ రాజధానిగా ఉండేది.
– గౌతమ బుద్ధుని కాలంలో తెలంగాణ ప్రాంతం విశేషంగా విలసిల్లింది.
– శాతవాహనుల జన్మస్థలం నిజామాబాద్ ప్రాంతమని, మొదట ఇక్కడ స్థిరపడిన తర్వాతనే అమరావతి ప్రాంతాలకు వెళ్లారని ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం.
– తెలంగాణలోని కొండాపురం (కొండాపూర్) శాతవాహనుల టంక శాల నగరం అని మల్లంపల్లి సోమశేఖర శర్మగారు చెప్పారు.
– వరంగల్లు సమీపంలో సాద్వవాహన పేరుతో కొన్ని నాణేలు లభ్యం అయ్యాయి.
– ఇక్ష్వాకుల వంశుస్థుడైనా శాంత మూలుడు అస్మక, ములక ప్రాంతాలను (ప్రాచీన తెలంగాణ పేర్లు) జయించాడని బి.ఎన్.శాస్త్రిగారు తెలిపారు.
– విష్ణుకుండినుల కాలంలో తెలంగాణ ప్రాంతం ప్రభావం పెరిగింది. వీరు రాజ్య విస్తరణలో భాగంగా తమ స్వస్థలమైన తెలంగాణను వదిలి మహబూబ్‌నగర్, నల్గొండ ప్రాంతాల నుంచి తూర్పు దిశగా వేంగీకి చేరుకున్నారు.
– చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన భవభూతి క్రీ.శ. 7,8 శాతాబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలోనే వర్ధిల్లాడు.
– వేములవాడ చాళుక్యులు (క్రీ.శ. 750-973) మధ్య కాలంలో బోధన్, వేములవాడ కేంద్రాలుగా పశ్చిమోత్తర తెలంగాణ ప్రాంతమును పరిపాలించారు. దీన్ని ‘సపాద లక్షదేశం’గా వ్యవహరించేవారు.
– గోదావరి నదికి దక్షిణాన, మంజీరా నది నుంచి మహాకాళేశ్వరం వరకూ వ్యాపించిన భూభాగాన్ని ‘పోదనపాడు’ అని వ్యవహరించేవారు.
– కళ్యాణీ చాళుక్యులు, కందూరు చోడుల కాలంలో సాంస్కృతికంగా, రాజకీయంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది.
– నల్గొండ దుర్గం, యాదాద్రి జిల్లాలోని కొనుపాక, ఖమ్మం జల్లాలోని నేలకొండపల్లి వంటి ప్రాంతాల ప్రస్తావన నాటి శాసనాల్లో విరివిగా కన్పిస్తుంది.
– తొలి కాకతీయులతో పాటు, ముదిగొండ చాళుక్యులు, పొలవాస నాయకులు, కందూరి చోడులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలను పరిపాలించారు.
– కాకతీయుల యుగం నుండి కుతుబ్‌షాహీలు, అసఫ్ జాహీల పరిపాలనా కాలం వరకు, జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక పరిణామాలు తెలంగాణకు తిరుగులేని చారిత్రక ఉనికి, ప్రాధాన్యతను సంతరించి పెట్టాయి.
– చరిత్ర పూర్వ యుగం నుండి ఆధునిక యుగం వరకు తెలంగాణ చరిత్ర గర్వించదగ్గ విశిష్టత ఉంది.
తెలంగాణ చరిత్ర ఆధారాలు
– చరిత్రను పునర్నించడానికి గల ఆధారాలను ప్రధానంగా లిఖిత పూర్వక ఆధారాలు, పురావస్తు ఆధారాలుగా విభజించారు.
– భాష, లిపి లేకుండా అనేక వేల సంవత్సరాలు మానవులు జీవించారు. లిపి లేని దశను చరిత్ర పూర్వ యుగంగా పిలుస్తారు.
– చరిత్ర పూర్వయుగ కాలానికి సంబంధించిన వివరాలు తెలుసు కోవడానికి పురావస్తు ఆధారాలు మాత్రమే ఉపయోగపడతాయి.
పురావస్తు ఆధారాలు
– నివాస స్థలాలకు సంబంధించిన అవశేషాలు, లేదా కట్టడాలు, శాసనాలు, నాణేలను పురావస్తు ఆధారాలుగా పరిగణిస్తారు.
సాహిత్య ఆధారాలు
– సాహిత్య లేదా లిఖిత పూర్వక ఆధారాలు ఏ ప్రాంతపు చరిత్ర తెలుసుకోవడానికైన ముఖ్యమైన ఆధారం.
– లిఖిత ఆధారాలను స్వదేశీ, విదేశీ రచనలుగా విభజించారు.
– స్వదేశీ రచనలను లౌకిక, మతపరమైన గ్రంథాలుగా వ్యవహరిస్తారు.
స్వదేశీ రచనలు
– మత గ్రంథాలలో వైదిక, బౌద్ధ, జైన గ్రంథాలు ప్రాచీన తెలంగాణ చరిత్రకు ఆధారాలు. ఉదా: ఆచార్య నాగార్జునుని రచనలు, వేములవాడ చాళుక్య రాజు రెండో అరికేసరి అస్థానకవి పంప రచించిన ప్రముఖ గ్రంథం ‘ఆది పురాణం’.
– లౌకిక గ్రంథాలు ఆనాటి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు పరిపాలనాంశాలు తెలియజేస్తాయి.
– పంప కవి రచించిన ‘విక్రమార్క విజయం’, విధ్యానాథుడు రచించిన ”ప్రతాపరుద్ర యశోభూషణం” అప్పటి సమాజ ఆర్థిక స్థితిగతులు తెలియజేస్తున్నాయి.
– కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’లోని అంశాలను సూక్ష్మంగా పరిశీలిస్తే దక్షిణాపథ వర్తక వ్యాపారాలను గూర్చి ప్రస్తావించిన ఆధ్యాయాల్లో, తెలంగాణకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులు కనిపిస్తాయి..
విదేశీ రచనలు
– క్రీ.శ. తొలి శతాబ్దంలో వచ్చిన గ్రీకు రచనలు ప్రత్యక్షంగా, పరోక్షం గాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు తెలియ చేస్తాయి.
– ఉదాహరణకు ”ఎర్ర సముద్రపు దినచర్య” అనే గ్రంథంలో తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రా కోస్తా ప్రాంతానికి ఏ విధంగా వస్తువుల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నవో తెలియజేస్తుంది.
తెలంగాణ మధ్యయుగ చరిత్రకు సంబంధించిన సాహిత్యాధారాలు
– ప్రొఫెసర్ హెచ్.కె. షేర్వానీ రచించిన ‘ది కుతుబ్‌షాహీస్ ఆఫ్ గోల్కొండ’.
– డా.యన్.వెంకటరమణయ్య మరియు శ్రీమల్లంపల్లి సోమశేఖర శర్మ రచించిన ‘ది కాకతీయాస్ ఆఫ్ వరంగల్’
– యజ్ఞాని (ఎడిటెడ్) ‘ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డక్కన్, సంపుటి-, భాగం
– మారేమండ రామారావ్ ‘కాకతీయ సంచిక’.
– పి.శ్రీనివాసాచార్ ‘పొలిటికల్, సోషల్ అండ్ రెలిజియస్ కండిషన్స్ ఆఫ్ ది దక్కన్ అండర్ ది కాకతీయాస్’ ఇన్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హైదరాబాద్ ఆర్కియోలాజికల్ అండ్ హిస్టారికల్ సొసైటీ, జనవరి టు ఆగస్టు 1941, మొదలైనవి మధ్యయుగానికి సంబంధించిన సాహిత్యాధారాలు.
తెలంగాణ ఆధునిక చరిత్రకు ఆధారాలు
– ఆధునిక తెలంగాణ చరిత్ర అంతా అసఫ్ జాహీల పాలనతో నిండి ఉంది.
– ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, పాఠశీక, అరబిక్ భాషల పదజాలం, ఉర్దూ భాషలో ఉండేవి.
– ఆసఫ్ జాహీల పాలనకు సంబంధించిన సాహిత్య ఆధారాలు చాలా ఉన్నాయి.
– సుబేదారీ రికార్డులు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, ఇండ స్ట్రియల్ స్టాటిస్టిక్స్, సెన్సెస్ రిపోర్ట్స్, విలేజ్ లిస్ట్స్, స్టాటిస్టికల్ ఆబ్జెక్స్, ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ మొదలగునవి ఉన్నాయి.
– వరంగల్ సుబా (విభజన పూర్వపు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు) పైన డా.వి. రామకృష్ణారెడ్డి 1987లో ”ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్” 1911-1950 అనే గ్రంథాన్ని వెలువరించారు.
– మెదక్ సుబా (విభజన పూర్వపు మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు) కు సంబంధించి, ఆచార్య వి. రామకృష్ణారెడ్డి మేజర్ రీసెర్చి ప్రాజెక్ట్స్ చేపట్టి, ”సోషల్ అండ్ ఎకనామిక్ డైనమిక్స్ ఆఫ్ మెదక్ సుబా ఆఫ్ ఫార్మర్ హైదరాబాద్ స్టేట్, 1905 1950 ఎ.డి.ను అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫ్ మెదక్ సుబా ఆఫ్ ఫార్మర్ హైదరాబాద్ స్టేట్, 1905-1950 ఎ.డి.ను వరుసగా 2012, 2014 ల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చారు.
– శ్రీ.యస్. కేశవ అయ్యంగార్ ఆర్థిక సర్వేలను జరిపి ”ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ది హైదరాబాద్ స్టేట్, 1929-30, రూరల్ ఎకనామిక్ ఎన్క్వరీస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, 1949-51లను అందించడం జరిగింది.
– టెనెన్సీ కమిటీ రిపోర్ట్ (1940), రిపోర్ట్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్‌డెటెడ్‌నెస్ (1937), ది బ్యాంకింగ్ ఎన్‌క్వైరీ కమిటీ రిపోర్ట్ (1930), ది. అగ్రేరియన్ రిఫార్మ్స్ కమిటీ రిపోర్ట్ (1949), రాయల్ కమిషన్ రిపోర్ట్ ఆన్ జాగీర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిఫార్మ్స్ (1947) వస్తాయి.
– హైదరాబాద్ రాష్ట్రంలో వచ్చిన ఉద్యమాలు, ప్రజా సామాజిక ఉద్యమాలు, రైతాంగ పోరాటం, స్వాతంత్య్ర పోరాటం, విలీనోద్యమాన్ని గురించి వీటిలో పాల్గొన్న నాయకులు వారి రచనలు ఆధునిక తెలంగాణకు సంబంధించిన అంశాలు తెలియ జేస్తున్నాయి.
– పోరాట నాయకులు (రచనలు చేసిన వారు) రావి నారాయణరెడ్డి, డి. వెంకటేశ్వరరావు, సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ మాడపాటి హనుమంతరావు, మందముల నర్సింగరావు, యమ్.బసవపున్నయ్య మొదలైన వారు రచనల ద్వారా విలువైన సమాచారాన్ని అందించారు.
– ఆధునిక తెలంగాణకు సంబంధించిన సమాచారం అందించిన పత్రికలు గోలకొండ పత్రిక, దక్కన్ క్రానికల్, మీజాన్, ది హిందు, రయ్యత్, సంచికలు : హైదరాబాద్ ఇన్ఫర్మేషన్, ది హైదరాబాద్ బులెటిన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ మొదలైనవి.
– హైదరాబాద్ డిస్ట్రిక్స్ గెజిటీర్స్, 1931-1936, యమ్.వి. రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్స్ గెజిటీర్స్ 1976, ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియా, ప్రొవిన్షియల్ సిరీస్, హైదరాబాద్ స్టేట్, 1909.
– యన్. రమేషన్ (ఎడిటెడ్) ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్, నాలుగు సంపుటాలు, 1966, ఆధునిక తెలంగాణ చరిత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తున్నాయి.
తెలంగాణ చరిత్రకు వ్యక్తిగత రచనలు
– యస్.హెచ్. బిల్గ్రామి మరియు సి. విల్‌మోట్‌లు రచించిన ”హిస్టారికల్ అండ్ డిస్క్రిప్టివ్ స్కెచ్ ఆఫ్ హిజ్ హైనెస్ ది నిజామ్స్ డొమినియన్స్, 1983.
– ఎ.ఐ.ఖురేషి, ‘ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్’ సంపుటి-1, 1941.
– జె.డి.బి. గ్రిబుల్ ‘ఏ. హిస్టరీ ఆఫ్ ది దక్కన్ సంపుటి-1’, 1896.
– క్రిస్టఫ్ వాన్ ప్యూరర్ అండ్ హైమండార్ఫ్ / ది అబోరిజనల్ ట్రైబ్స్ ఆఫ్ హైదరాబాద్.
పురావస్తు ఆధారాలు
– వివిధ ప్రాంతాలలో జరిపిన తవ్వకాలలో లభించిన భౌతిక అవశేషాలను పురావస్తు ఆధారాలంటారు.
– చరిత్ర పూర్వ యుగానికి చెందిన (ప్రాచీన, నవీన శిలాయుగానికి) నివాస స్థలాలు, మృణ్మయ పాత్రలు, సమాధులు మొదలైనవి ఆధారాలుగా ఉపయోగపడతాయి.
– ప్రాచీన శిలాయుగ ఆవాసాలు తెలంగాణలో ఎక్కువగా కన్పిస్తాయి. కుమ్రంభీం జిల్లాలోని ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, పెద్దపల్లి జిల్లాలోని రామగిరి, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం, నార్కెట్‌పల్లి, యాదాద్రి జిల్లాలోని వలిగొండ ంటి ప్రాంతాల్లో లభ్యమయ్యాయి.
– నవీన శిలాయుగానికి సంబంధించిన బూడిద దిబ్బలు, రాతి పనిముట్లు, కుండ పెంకులు తెలంగాణ అంతట లభ్యమయ్యాయి.
– మెగాలిథిక్ లేదా బృహత్ శిలాయుగానికి చెందిన సమాధులు హైదరాబాద్ (కొండాపూర్, బోయినపల్లి) విభజన పూర్వపు నల్గొండ, కరీంనగర్ ప్రాంతాలలో కన్పిస్తాయి.