ప్రజాస్వామ్యంలో సామాన్యుడి
బతుకు చెల్లని నోటయింది
మండే ఎండలో చెమట చిందుతూ
వారాంతాన ఇచ్చి పెద్ద నోటు చెల్లదని
ఏలే వాళ్ళు ఇచ్చిన తాకీదు చూసి
”ఈ వారానికి నేనెట్టా బతికేదీ
నా వాళ్ళ కడుపులనెలా ఓదార్చేది
పని వదిలి నోటెలా మార్చేది
”రద్దన్న పెద్దన్నకేం తెలుసు” చీమ బాధ
చెవుల్లో సీసాలు పోసుకున్న తరువాత
ప్రజాస్వామ్యానికేసిన ముసుగు తెరల్లో చేరాక
కళ్ళు మూసుకున్న పిల్లులై కూచున్నాక
ప్రజల ఘోషేమిటో పాలక మాటేమిటో
వారి ఆదేశాల కత్తులపై నడకేమిటో తెలిసేదెలా?
ఓటు నాడు నోటు మాట తప్ప
నోరెత్తనివ్వని జనాన్ని నిలిపి నపుడు
రాజ్యాంగంలో రాసుకున్న
ప్రజాస్వామ్యం శవమైంది
ఇప్పుడు జనం ఘోషకూ పాలక భాషకూ
బంధం తెగి ప్రజలది చెల్లని బతుకైంది
తెగిన బంధం కుట్టేదారం పట్టనంత వరకూ
కొత్తగా హత్యకు గురయ్యే నోట్లేమి ఉంటాయి?