చైతన్యసేద్యం డైరీ ఆవిష్కరణ 

నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వ్యవసాయ మాసపత్రిక చైతన్యసేద్యం 2024 డైరీని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ ఆదివారం ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నందేవ్ వాడలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ..చైతన్యసేద్యం మాస పత్రికలో వచ్చే అంశాలు రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. 9 సంవత్సరాల నుండి చైతన్యసేద్యం డైరీలు రైతాంగానికి అందుబాటులో తెస్తున్నామని అన్నారు. ఎరువులు, పురుగుల మందులున, విత్తనాలు, వ్యవసాయ పరికరాల ధరలు పెరిగాయని, పెట్టుబడి ఖర్చుకూడ రాకపోవడంతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాల నుండి సహయం అందని స్థితిలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై అనేక వ్యాసాలను రైతాంగం ముందుకు తెస్తున్నామన్నారు. వ్యవసాయంలో ఎదురైయ్యే చీడపిడల గురించి వ్యవసాయంలోని మెళకువలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పోరేట్లకు దోచి పెడుతుందని అన్నారు. రైతాంగ పోరాటం వల్ల ప్రభుత్వం దిగివచ్చిన ఢిల్లీ ఉద్యమంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. రైతులపై పెట్టిన కేసులు కూడా ఎత్తివేయలేదని అన్నారు. చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు పరిహారం అందజేయాలని కోరారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ఆత్మహత్యల నివారణకు స్వామినాథన్‌ కమీషన్‌ చేసిన సిఫార్సులను అమలు చేయాలని అన్నారు. రుణాల రద్దు కోసం పార్లమెంట్‌లో చట్టం తేవాలని కోరారు. బడ్జెట్‌లో నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఆదాయం కోసం ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పంటల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేశు అధ్యక్షులు ఎం గంగాధరప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ద వెంకట రాములు, పి భూమన్న, సాయిలు,  దేవేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.