– ముఖ్య అతిథులుగా వివేక్, జగన్
నవతెలంగాణ-హైదరాబాద్
కెఎస్‌జి జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జెపీఎల్) జెర్సీల ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి పది జట్లు, ఐదు రోజుల పాటు పోటీపడుతున్న టోర్నమెంట్ జెర్సీ ఆవిష్కరణ శనివారం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి. వివేక్ వెంకటస్వామి, హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, త్రుక్ష ఫుడ్స్ ఎండీ భరత్ రెడ్డి, లైఫ్‌స్పాన్ స్పోర్ట్స్ చీఫ్ భరణి, కెఎస్‌జి సీఈవో సంజరు, హెచ్‌సీఏ సభ్యులు సునీల్ అగర్వాల్, ఆగం రావు సహా స్మయిల్‌గార్డ్ ఫౌండర్ శరత్, జూపర్ ఎల్ఈడీ ఫౌండర్ రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరై పది జట్ల జెర్సీలను ఆవిష్కరించారు. జెపీఎల్లో పోటీపడుతున్న పది జట్ల క్రీడాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘పాత్రికేయులు నాకు కుటుంబ సభ్యుల వంటివారు. జర్నలిస్ట్‌లు క్రికెట్ టోర్నమెంట్లో పోటీపడటం అభినందనీయం.
మైదానంలో అడుగుపెడితేనే ఆటగాళ్ల కష్టాలు సైతం తెలుస్తాయి. ఆటగాళ్ల కోణంలో మెరుగైన కథనాలు రాయగలరు’ అని వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘క్రీడా రంగం, క్రీడాకారుల అభివృద్దికి నిత్యం పరితపించే పాత్రికేయులు క్రీడాకారులుగా మారిపోయి గ్రౌండ్లోకి దిగడం సంతోషం. జెపీఎల్లో పోటీపడుతున్న అన్ని జట్లకు అభినందనలు. క్రీడా స్ఫూర్తితో జెపీఎల్ టైటిల్ కోసం ఉత్తమ ప్రదర్శన చేయాలని’ జగన్మోహన్ రావు అన్నారు.