
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ( టిఎస్ యూటీఎఫ్ ) కాలమానిని మండల విద్యా వనరుల కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికృష్ణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో యూటీఎఫ్ నిరంతరం పాటుపడుతుందని అభినందించారు. అదే విధంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. హక్కులు, బాధ్యతలు రెండు ఉద్యమ నేత్రాలుగా పని చేయడం గొప్ప పోరాట పటిమకు నిదర్శనమని ఆయన అన్నారు.యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను సత్వరమే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టులో ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కారానికి చొరవ చూపి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. బదిలీలు, పదోన్నతుల తర్వాతనే మెగా డియస్సీకి ఆస్కారం ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులకు వీలయినంత తొందరలో అంతర్గత టెట్ నిర్వహించి పదోన్నతులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో సిఆర్పీలు బాలరాజు, నరేందర్, సంతోష్ , ఐఆర్పీ జలంధర్ తదితరులు పాల్గొన్నారు.