పాలుపోసి, పెంచి పోషించిన వ్యక్తిని చివరకు ఆ పామే కాటేసి చంపినట్టు…తన రాజకీయ లబ్ది కోసం బీజేపీ సృష్టించిన వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెండ్స్ ఇప్పుడు బీజేపీ నేతలపైనే తమ పోస్టుల ద్వారా ఎదురుదాడికి దిగుతున్నారు. నేతల సైన్యాలుగా మారి రచ్చ చేస్తున్నరు. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ అని పాట పాడుతున్నరు. ‘బండి సంజరు పదవి పీకేయించిన తర్వాత కండ్లు చల్లబడ్డయా?’ అంటూ అసమ్మతి రాగం ఎత్తుకున్నరు. ‘బీజేపీ నడ్డి విరిసిన నడ్డా.. ‘ఐపాయే..ఆ ఊపు ఉండదిక’ అంటూ రివర్స్ పంచ్‌లేస్తున్నరు. ‘గతంలో కిషన్‌రెడ్డి అధ్యక్షునిగా ఉన్నాడు. అప్పుడు బీజేపీ గ్రాఫ్ పెద్దగా ఏం లేదు’ అంటూ హార్డ్‌కోర్ బీజేపీ కార్యకర్తలే తమ వాట్సాప్, ఫేస్‌బుక్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ‘అయ్యో బాలి..అయ్యో బాలి’, ‘చాలు బండి..సెలవు బండి’ అని మరికొందరు రచ్చ చేస్తున్నారు. తాము వదిలిన బాణాలే రివర్స్ అయ్యి గుచ్చుకుంటుండటంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు తప్పుడు, అసత్య ప్రచారాలతో కూడిన పోస్టులు పెట్టి మరీ ప్రజల మెదళ్ళను విద్వేషపూరితం చేసిన విద్యార్థులను నేతలు వద్దురయ్యా అని బతిమిలాడుకోవాల్సి వస్తున్నది. ‘అలాంటి పోస్టులు పెట్టకండి ప్లీజ్.. మేమంతా కలిసే ఉన్నాం’ అంటూ బండి సంజరు చేతులెత్తి దండంపెట్టినా ఆ పోస్టులు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ‘ఊరు ఉసిరికాయంత..తగువు తాటికాయంత’ అన్నట్టుగా బీజేపీ పరిస్థితి ఉంది. ఈ పోస్టులతో నేతల మధ్య అగ్గి మరింత రాజుకుంటున్నది. ‘చెడపకురా…చెడదవు’ అని పెద్దలు ఊరికే అనలేదు సుమా!
– అచ్చిన ప్రశాంత్